News

బంజారా సమాజ ఐక్యతకు ‘బంజారా ఏక్తా సంకల్ప్ యాత్ర’ దోహదం

6views

అనంతపురం: బంజారా సమాజ ఐక్యత, సామాజిక చైతన్యం, సాంస్కృతిక పరిరక్షణకు ‘బంజారా ఏక్తా సంకల్ప్ యాత్ర’ ఒక చారిత్రాత్మక ఉద్యమంగా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బంజారా ప్రజల పవిత్ర పుణ్యక్షేత్రం, సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జన్మస్థలమైన సేవాగడ్ నుంచి న్యూఢిల్లీ వరకు చేపట్టనున్న ‘బంజారా ఏక్తా సంకల్ప్ యాత్ర’ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బాబా లఖీషా బంజారా, బాబా మఖన్ షా లుబానా జయంతి సందర్భంగా “ఒకే జెండా.. ఒకే గుర్తింపు.. ఒకే సంకల్పం” అనే నినాదంతో ప్రారంభమైన ఈ యాత్ర దేశవ్యాప్తంగా బంజారా సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు సామాజిక చైతన్యం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు దోహదపడుతుందని అన్నారు.

విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, హక్కుల సాధన వంటి రంగాల్లో బంజారా సమాజం మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. సమాజ అభివృద్ధికి ఐక్యతే బలమని, యువత విద్యను ఆయుధంగా చేసుకుని అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పాల్గొన్న పూజ్య సంతులు, ఆధ్యాత్మిక గురువులు, ప్రముఖులు, దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన బంజారా సోదర సోదరీమణులను మంత్రి అభినందించారు. బంజారా సమాజం తన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.