ArticlesNews

సనాతన వ్యవసాయ సంస్కృతికి ప్రతీక ఏరువాక పౌర్ణమి

38views

( జూన్‌ 29 – ఏరువాక పూర్ణిమ )

భారతీయ సంస్కృతిలో వ్యవసాయాన్ని కేవలం వృత్తిగా కాకుండా యజ్ఞంగా భావిస్తారు. పంచభూతాల సాక్షిగా భూమాత ఒడిలో జీవనాన్ని పండించే రైతు విష్ణు స్వరూపుడు. అలాంటి అన్నదాత కొత్త వ్యవసాయ సంవత్సరానికి శ్రీకారం చుట్టే పవిత్రమైన పర్వదినమే “ఏరువాక పౌర్ణమి”. ఈ ఏడాది ‘జూన్ 29’న ఈ విశిష్ట వ్యవసాయ పండుగను తెలుగు రాష్ట్రాల రైతులు భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు.

జ్యేష్ఠ మాస పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను రైతుల కొత్త వ్యవసాయ ఆరంభంగా భావిస్తారు. “ఏరు” అంటే నాగలి, “వాక” అంటే దున్నడం. తొలకరి వర్షాలు కురిసిన అనంతరం మొదటిసారిగా నాగలితో భూమిని దున్ని సాగుకు శ్రీకారం చుట్టే సంప్రదాయాన్నే ఏరువాక అంటారు.

భూమాతకు, గోమాతకు ప్రత్యేక పూజలు
ఈ పండుగ రోజు రైతులు వ్యవసాయానికి తోడ్పడే ఎద్దులు, ఆవులను స్నానం చేయించి, వాటి కొమ్ములకు రంగులు పూసి, పూలతో అలంకరిస్తారు. నాగలి, గొర్రు, పార వంటి వ్యవసాయ పరికరాలకు పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహిస్తారు. పొలంలో భూదేవిని ఆరాధించి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థిస్తారు. పొంగలి, పులగం వంటి నైవేద్యాలను సమర్పించి గోమాతకు, దేవతలకు అర్పిస్తారు.

వేదాల నుంచి వస్తున్న సనాతన సంప్రదాయం
ఏరువాక పౌర్ణమికి వేద, పురాణ సంప్రదాయాల్లో విశిష్ట స్థానం ఉంది. వేదాల్లో దీనిని “అనడుత్సవం”గా పేర్కొనగా, విష్ణు పురాణంలో దీనిని “సీతా యజ్ఞం”గా వర్ణించారు. సంస్కృతంలో “సీత” అంటే నాగలి చాలు అని అర్థం. క్షేత్రపాలకుని స్తుతిస్తూ తొలి దుక్కి దున్నడం అనాదిగా వస్తున్న ఆచారంగా శాస్త్రాలు వివరిస్తున్నాయి.బౌద్ధ సంప్రదాయ కథనాల ప్రకారం శుద్ధోధన మహారాజు స్వయంగా నాగలి పట్టి ఏరువాక ప్రారంభించినట్లు చెబుతారు. అలాగే శ్రీకృష్ణదేవరాయలు కూడా రైతులకు గౌరవ సూచకంగా స్వయంగా దుక్కి దున్నినట్లు చారిత్రక కథనాలు పేర్కొంటాయి.

గ్రామీణ జీవనానికి కొత్త సంవత్సరం
ఏరువాక పౌర్ణమిని గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కొత్త సంవత్సర ఆరంభంగా భావిస్తారు. రైతుల వద్ద పనిచేసే పాలేర్లకు పాత ఒప్పందాలు ముగిసి, కొత్త ఒప్పందాలు ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. పెళ్లైన కుమార్తెలను పుట్టింటికి ఆహ్వానించడం, తల్లిదండ్రులు, సోదరులు, పశువులకు హారతులు ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతోంది.ఈ సందర్భంగా నిర్వహించే ఎడ్ల పందేలు, బండలాగుడు పోటీలు, నాగలి పాటలు, సాగు పాటలు తెలుగు గ్రామీణ సంస్కృతికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఆచారం వెనుక శాస్త్రీయత
ఏరువాక పౌర్ణమి ఆచారాల్లో శాస్త్రీయ దృక్పథం కూడా దాగి ఉంది. తొలకరి వర్షాలు కురిసిన వెంటనే భూమిని దున్నడం వల్ల మట్టిలోని హానికర వాయువులు బయటకు వచ్చి, భూమి నత్రజనిని గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. దుక్కి దున్నే సమయంలో నేలలో దాగి ఉన్న పురుగులు, వాటి గుడ్లు బయటపడటంతో పక్షులు వాటిని తిని సహజసిద్ధమైన తెగుళ్ల నివారణ జరుగుతుంది.అలాగే వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులను నివారించేందుకు ఆయుర్వేద మందులు తాగించడం, వేపనూనె రాయడం వంటి సంప్రదాయాలు కూడా ఈ రోజున పాటిస్తారు.

ప్రకృతి ఆరాధనకు ప్రతీక
ఏరువాక పౌర్ణమి కేవలం రైతుల పండుగ మాత్రమే కాదు. ప్రకృతి, భూమాత, గోమాత, వ్యవసాయ పరికరాలు, పశుసంపద పట్ల కృతజ్ఞతను వ్యక్తపరిచే సనాతన భారతీయ సంస్కృతికి ఇది సజీవ ప్రతీక. భూమిని దేవతగా భావించి, ప్రకృతిని పూజిస్తూ సాగు ప్రారంభించే ఈ పవిత్ర పండుగ భారతీయ వ్యవసాయ సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెబుతోంది.

అన్నదాత సుఖసంతోషాలతో ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందనే భావనను తరతరాలకు అందిస్తున్న మహోన్నత వ్యవసాయ పర్వదినమే “ఏరువాక పౌర్ణమి”.