
ఖమ్‌ణోర్ యుద్ధం
జూన్ 18, 1576
అది జూన్ 18, 1576… ఆ రోజు సూర్యుడు భిన్నమైన తేజస్సుతో ఉదయించాడు. యుద్ధ భూమిలో శూరవీరులతోపాటు భీతిల్లిన మనోబలం లేదా స్వభావం కలిగిన సేనలను గురించి కవిరాజు సూర్యమల్ మీసణ్ తన కవితల్లో అద్భుతంగా వర్ణించారు. పిరికితనం కలిగిన వారి శరీరం భయంతో ఎలా కంపిస్తుందో, వీరుల పరాక్రమం, తేజస్సు నాలుగు దిక్కులా అలా వ్యాపిస్తుందని అభివర్ణించాడు. యుద్ధంలో వీరుల కవచం ఎలా మెరుస్తుందో అలా రణభూమిలో వారి శౌర్యపు తేజస్సు సూర్యుడు ప్రకాశాన్ని కూడా మసకబారేలా చేస్తుందంటాడు.
ఖమ్‌ణోర్ (హల్దీఘాటీ అని కూడా పిలిచే) మైదానంలో అటువంటిదే జరిగింది. భారతీయ వీరులు మొగలుల యుద్ధకౌశలాన్ని నిస్తేజం చేసి, వారిని వారి శిబిరం వరకూ తరిమికొట్టారు. కానీ అంతకుముందు రోజు మేవాడ్ వీరుడు మహారాణా ప్రతాప్ చూపిన నైతిక పరాక్రమం అద్భుతమైనది.
మోసంతో శత్రువును వధించలేదు
మహారాణా ప్రతాప్ కేవలం వీరుడైన ఒక సేనా నాయకుడే కాదు, యుద్ధంలో కూడా మానవీయ నైతిక విలువలకు కూడా అత్యున్నత స్థానాన్ని ఇచ్చిన ధీరోదాత్తుడు. యుద్ధం ప్రారంభమవడానికి ఒక రోజు ముందు మధ్యాహ్న సమయంలో మాన్‌సింగ్ కొందరు సైనికులతో పాటు వేటకు వెళ్లాడని, ఆ సమాచారం వేగుల ద్వారా మహారాణాకు అందిందనే ప్రస్తావనలు ఉన్నాయి. ‘ఇది చాలా మంచి అవకాశం చేయిజార్చు కోకుండా శత్రువును చంపివేయాలని’ హితులు చెప్పారు. కానీ, వీరుడైన మహారాణా తన క్షత్రి యోచితమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఇటువంటి మోసం, వంచనతో శత్రువును చంపడం నిజమైన క్షత్రియులు చేసే పని కాదంటూ జవాబిచ్చాడు. రేపు యుద్ధంలో మాన్‌సింగ్‌ను ముఖాముఖి ఎదుర్కొందాం. మోసంతో శత్రువును చంపడం వీరోచిత కార్యమని ఆయన భావించలేదు.
యుద్ధ ప్రకటన
అక్బర్ ఫతేపూర్ సిక్రీ నుంచి అజ్మీర్‌లోని మొయినుద్దీన్ చిస్తీ దర్గాను దర్శించేం దుకు వచ్చాడు. అక్కడే, ఆయన మహారాణా ప్రతాప్‌కు వ్యతిరేకంగా 1 మార్చి 1576లో అతడు యుద్ధ ప్రకటన చేశాడు. ఈ యుద్ధానికి నేతృత్వం వహించేందుకు మాన్‌సింగ్‌ను నియమించాడు. హల్దీఘాటీ యుద్ధంలో మాన్‌సింగ్‌ను సేనాపతిని ఎందుకు చేశాడన్నది ఒక ముఖ్యమైన విషయం. అంతకు ముందు, ఏ హిందువునూ మొగల్ సేనలకు అధిపతిని చేయలేదు. మాన్‌సింగ్‌ను సేనాపతిని చేయడంపై ‘ఇక్బాల్‌నామా `ఎ` జహంగీరీ’ రచయిత ముతమిద్ ఖాన్, ‘ దర్బారు తయారు చేసిన వీరుడు, ప్రత్యేకమైన వ్యక్తి మాన్‌సింగ్. అంతేకాదు, ప్రియమైన కుమారుడు అనే బిరుదు అతడికి ఇచ్చారు. అజ్మీర్‌కు చెందిన ముస్లిం, హిందూ సర్దారులతో కలిసి మహారాణాను ఓడించేందుకు అతడిని పంపారు. అతడిని పంపడం వెనుక అక్బర్ ఉద్దేశ్యం ఏమిటంటే, అతడు కూడా మహారాణా ప్రతాప్‌కు చెందిన జాతివాడు కావడం. మహారాణా ప్రతాప్‌ను అధీనం చేసుకోవడం. పన్నులు వసూలు చేయడం. ఇతడిని పంపడం వెనుక ఉన్న ఉద్దేశం, మహారాణా అతడిని తన ముందు అల్పుడిగా, దాసుడిగా భావించడంతో, తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందనే దృష్టితో యుద్ధభూమిలో ముందుకు వచ్చి, హత్యకు గురికావాలన్నదే.’ అతడిని సేనాపతిని చేయడం వెనుక ద్వంద్వ నీతి పని చేస్తోందన్న మాట.
హల్దీఘాటీ ఎంపిక
తన సేనలతో కలిసి మాండల్‌గఢ్ వెళ్లి అక్కడ ఆగిపోయాడు. అక్కడ అతడు మహారాణా ప్రతాప్ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. వయోవృద్ధుడు, అనుభవజ్ఞుడైన రామ్ షా తావర్ వ్యూహాత్మక సలహాతో మహారాణా ప్రతాప్ మాండల్‌గఢ్ వెళ్లే ఆలోచనను విరమించుకున్నాడు. ఎందుకంటే, మొగల్ సేనలకు కొండ ప్రాంతంలో పోరాడే అనుభవం లేదు. అందువల్ల, శత్రువుల బలహీనత నుంచి లబ్ధి పొందేందుకు మహారాణా ప్రతాప్ మాండల్‌గఢ్ వంటి మైదాన భూభాగానికి వెళ్లకుండా, మొగల్ సేనలు కొండ ప్రాంతం వైపు వెళ్లే వరకూ నిరీక్షించాడు. దాదాపు రెండు నెలల పాటు వేచి ఉన్న తర్వాత మాన్‌సింగ్ మాండల్‌గఢ్ నుంచి బయలుదేరి మోహి గ్రామం గుండా ప్రయాణించి, ఖమణోర్ సమీపంలోని బనాస్ నది ఉత్తర ఒడ్డున ఉన్న బేస్ మోలేలా గ్రామంలో తన సైనిక శిబిరాన్ని స్థాపించాడు. మహారాణా ప్రతాపుడు కూడా తన సైన్యంతో గోగుందా గ్రామం నుంచి బయలుదేరి హల్దీఘాటీ నుంచి కొద్ది దూరంలో ఉన్న లోసింగ్ గ్రామంలోని చెరువు సమీపంలో తన సేనలను నిలిపివేశాడు.
ఖమణోర్ (హల్దీఘాటీ) యుద్ధం
“మాన్‌సింగ్, ఆసఫ్ ఖాన్ గోగుందా నుంచి 7 కోసుల దూరంలో ఉన్న లోయ వద్ద షాహీ సేనల సహితంగా వెళ్లడంతో, మహారాణా యుద్ధం చేసేందుకు వచ్చాడు. ఖ్వాజా ముహమ్మద్ రఫీ బక్షీ, షియాబుద్దీన్ గురోహ్, పాయన్దా కజ్జాక్, అలీ మురాద్ ఉజ్బెక్, రాజా లూణకరణ, బహలోల్ ఖాన్ సహా మాన్ సింగ్, అనేకమంది రాచరిక అశ్వసైనికులతో కలిసి, మధ్యలో ఏనుగుపై ఉన్నాడు. అంతేకాదు, ప్రసిద్ధమైన యువకులు సేనలకు ముందు వరుసలో ఉన్నారు. ఎంపిక చేసిన 80మందికి పైగా యోధులను సయ్యద్ హాషీమ్ బారహాతో కలిపి సేనలకు ముందుకు భాగానికి పంపగా, సయ్యద్ అహ్మద్ ఖాన్ పన్నెండు మంది ఇతర సయ్యదులతో కలిసి దక్షిణం వైపు ఉన్నాడు. షేఖ్ ఇబ్రహీం చిస్తీ బంధువు అంటే సిక్రీ రాజకుమారులతో కలిసి లోయకు ఎడమవైపు సేనలకు వెనుక భాగంలో ఉన్నాడు, అంటూ ఖమణోర్ యుద్ధ మైదానంలో ఉన్న కరడు గట్టిన సున్నీ మౌల్వీ అబ్దుల్ కాదిర్ బదయÖనీ తన పుస్తకంలో రాశాడు.
మొగల్ సేనల్లో తొక్కిసలాట
“మహారాణా కీకా (మహారాణా ప్రతాప్) హల్దీఘాటీ కనుమ ముఖద్వారం వరకు 3,000 మంది రాజపుత్రులతో ముందుకు సాగి, తన సైన్యాన్ని రెండు భాగాలుగా విభజించాడు. హకీం ఖాన్ సూర్ నేతృత్వంలో ఒక భాగం కొండల నుంచి బయలుదేరి, ముందువరుస సేనలపై దాడి చేసింది. భూమి ఎగుడు దిగుడుగా, రహదారి వంకర టింకరగా, ముళ్ల పొదలతో నిండి ఉన్న కారణంగా మొగల్ ముందు వరుస సేనల్లో గందరగోళం నెలకొంది. దీనితో ముందువరుసలో ఉన్న సేనలు చెల్లాచెదురైపోయాయి. మొగల్ సేనలోని రాజపుత్రులకు నాయకుడు రాజా లుణకరణ్. వీరిలో అత్యధికులు, ముఖ్యంగా ఉత్తరం వైపు ఉన్న వారు గొర్రెల మందల్లా పరుగులు ప్రారంభించి, ముందువరసలను చీల్చుకొని తమ రక్షణ కోసం దక్షిణంవైపు పరుగెత్తారు. ఈ సమయంలో ముందు వరుసలో ప్రత్యేక సైన్యంతో ఉన్న నేను (అల్ బదాయÖనీ) ఇటువంటి అవస్థలో మనం మన, శత్రుసేనలకు చెందిన రాజపుత్రులను ఎలా గుర్తుపట్టగలం అని ఆసఫ్ ఖాన్‌ను అడిగాను. అందుకు అతడు, నువ్వైతే బాణాలు వేస్తూ ఉండు, ఏ పక్షానికి చెందిన వ్యక్తికి అవి తగిలి మరణించినా, అది ఇస్లామ్‌కే మంచిది అవుతుంది కదా? అన్నాడు. అందుకే, మేం బాణాలు వేస్తూనే ఉన్నాం. గుంపు ఎలాంటిది అంటే మేం వేసిన ఒక్క బాణం కూడా వృధాకాలేదు. అంతేకాదు, కాఫీర్లను (హిందువులు) ను చంపే సౌభాగ్యం నాకు కూడా లభించింది. యుద్ధ క్షేత్రం ఇరుపక్షాల వీరుల మృతదేహాలతో నిండి పోయింది” అంటూ బదాయÖనీ రాసుకొచ్చాడు.
“మహారాణా ప్రతాప్ స్వయంగా నాయకత్వం వహిస్తున్న సైన్యంలోని రెండవ విభాగం, కొండల నుంచి బయటపడి లోయ ముఖ ద్వారం నుంచి కాడీ ఖాన్ సైన్యంపై దాడి చేశారు. అతడి సేనలను సంహరిస్తూ మహారాణా కీకా మధ్యవరకూ వెళ్లి పోయాడు. దానితో సిక్రీ వారసులు అంతా పారి పోయారు. వారి నాయకుడు, షేక్ ఇబ్రహీం అల్లుడు అయిన షేఖ్ మన్సూర్ పరుగులు తీస్తున్నప్పుడు ఒక బాణం రివ్వున వచ్చిగుచ్చుకుంది. అది ఎంత లోతుగా తగిలిందంటే, చాలా రోజుల వరకూ అతడి గాయం మానలేదు. కాడీ ఖాన్ ముల్లా అయినప్పటికీ, కొంత సమయం దృఢంగా నిలబడ్డాడు, కానీ కత్తితో అతని కుడి చేతి బొటనవేలు నరికివేయడంతో, అతను కూడా తన సహచరులతో పారిపోయాడు” అని యుద్ధ ఘటనలను బదయÖనీ రాసుకొచ్చాడు.





