
25views
ముస్లింలను భారతదేశం నుంచి ‘తరిమివేయాలి’ అని నమ్మే హిందువు, హిందువుగా కొనసాగలేడని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అధినేత మోహన్ భాగవత్ న్యూయార్క్‌లో చేసిన వ్యాఖ్యలను భారత్ ముస్లింలు సాదరంగా స్వాగతిస్తున్నారు. మోహన్ భాగవత్ వ్యాఖ్యలపై ఆలిండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసీ స్పందించారు. న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు.అలాగే సమర్థిస్తున్నట్లు తెలిపారు.
అప్పట్లో స్వామి వివేకానంద అమెరికాకి వెళ్లి, మాట్లాడిన మాటలను ప్రపంచం ఇప్పటికీ గుర్తుంచుకుంటోందని, అలాగే మోహన్ భాగవత్ మాటలు కూడా ఓ చరిత్రను సృష్టించాయన్నారు. వసుధైక కుటుంబం అన్న దానిని కూడా ఆయన ఉపయోగించారని, మోహన్ భాగవత్ ఎప్పుడు కూడా హిందూ, ముస్లిం అన్న మాటలు మాట్లాడలేదన్నారు. మనమంతా భారతీయులమే అన్న దానినే పదే పదే గుర్తు చేసుకుంటూ వచ్చారన్నారు. మన మన జాతులు, ధర్మం వేర్వేరు అయినా, వీటన్నింటి కంటే గొప్పదైంది మానవత్వమే అని అన్నారు.
మనమంతా భారతీయులమని, దీనిని గర్వంగా చెప్పాలని, దేశమే ప్రథమం అనేట్లుగా అందరూ మసులుకోవాలని సూచించారు. భిన్నత్వంలో ఏకత్వం అన్నదే భారత దేశ విశేషత అని మోహన్ భాగవత్ గుర్తు చేశారని, సంఘ్ పరివార్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సంఘటన అని ఉమర్ అహ్మద్ ఇల్యాసీ అన్నారు. ఓ కుటుంబ పెద్దగా, ముఖ్యునిగా అమెరికాకి వెళ్లి, ఈ విషయాలను ప్రస్తావించారన్నారు. అలాగే ఇమామ్ ల సమావేశంలోనూ ముక్తకంఠంతో మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలను స్వాగతించాలని ఆయన వెల్లడించారు.

ఆలిండియా ఇమామ్ ఆర్గనైజేషన్‌కే చెందిన మరో ముస్లిం నాయకుడు కూడా మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలను స్వాగతించారు, సమర్థించారు. గతంలోనూ ఓ సారి ఆయనతో హర్యానా భవన్ లో సమావేశం జరిగిందని, ముస్లిం ముఖ్యులందరూ ఈ సమావేశానికి హాజరయ్యారని పేర్కొన్నారు. దాదాపు 3 గంటలకు పైగానే ఈ సమావేశం జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఈ సమావేశంలో చాలా అంశాలు ముక్కుసూటిగానే చర్చకు వచ్చాయని, దేశంలో జరుగుతున్న చాలా అంశాలు కూడా చర్చకు వచ్చాయన్నారు. అలాగే ప్రధాన సమస్యలను కూడా ప్రస్తావించామని, చాలా మంది ముస్లిం నేతలు తమ మనసులోని మాటను ఆయన ముందు వుంచారని పేర్కొన్నారు. మోహన్ భాగవత్ కూడా తమ మనసులోని మాటను తమ ముందు వుంచారన్నారు. మోహన్ భాగవత్ అమెరికాలో చేసిన వ్యాఖ్యలను తాము సమర్థిస్తున్నట్లు తెలిపారు. భారత దేశంలో వివిధ మతాల వారు స్వేచ్ఛగా తమ తమ మతాన్ని ఆచరిస్తున్నారని, ఇలాంటి వాతావరణం ప్రపంచంలో ఎక్కడా కనిపించదన్నారు. తాను సౌదీ, దుబాయ్ లాంటి ప్రపంచ దేశాల్లో పర్యటించానని, కానీ.. ఇక్కడ వున్న మత సామరస్యం ఎక్కడా వుండదన్నారు. వారు అన్నట్లు పూర్వంలో అందరూ హిందువులేనని, డీఎన్ఏ కూడా ఒకటేనని, అయితే.. పద్ధతులు, ఆహారపు అలవాట్లు వేరు అని అన్నారు.
ఈ సంస్థ ముఖ్య ఖాజీ అయిన ముస్లిం నేత ముఫ్తీ మహ్మద్ తాహిర్ హుస్సేన్ మజహిరి మాట్లాడుతూ.. అమెరికాలో మోహన్ భాగవత్ సర్వమత సమభావాన్ని ఆవిష్కరిస్తూ ప్రకటన చేశారని పేర్కొన్నారు. వారు చేసిన వ్యాఖ్యలను తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. ఆలిండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసీ ఆధ్వర్యంలో ముఖ్యమైన ఇమామ్‌ల సమావేశం జరిగిందన్నారు. అందులోనే భాగవత్ వ్యాఖ్యలను ముక్తకంఠంతో సమర్థించామన్నారు. మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు భారతదేశ ఏకత్వాన్ని, అఖండత్వానికి మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు.





