News

హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు 162వ జయంతి వేడుకలు

10views

విజయనగరం: తెలుగు కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలపై చెరగని ముద్ర వేసిన హరికథా పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు 162వ జయంతి వేడుకలు ఆదిభట్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్‌ అధ్యక్షుడు, ఆదిభట్ల నారాయణదాసు మునిమనుమడు ఆనంద నారాయణదాసు నేతృత్వంలో కార్యక్రమం జరిగింది.

జిల్లా కేంద్రంలోని కానుకుర్తివారి వీధిలో ఉన్న ఆదిభట్ల నారాయణదాసు నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గుంకలాం జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు శ్లోకాలను ఆలపించారు.

తెలుగు కళా వైభవానికి ఆదిభట్ల ప్రతీక
కార్యక్రమానికి హాజరైన గుంకలాం జెడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం డాక్టర్‌ వెలమల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆదిభట్ల ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఆదిభట్ల నారాయణదాసు కళా వారసత్వాన్ని పరిరక్షిస్తూ హరికథ, కళాకారులకు అందిస్తున్న ప్రోత్సాహం సాంస్కృతిక రంగానికి ఎంతో విలువైన సేవ అని పేర్కొన్నారు.

ఆదిభట్ల నారాయణదాసు ఒక మహోన్నత సంతకమని, హరికథా కళకు స్వర్ణయుగాన్ని అందించిన మహనీయుడని కొనియాడారు. సాహిత్యం, సంగీతం, హరికథ, సంస్కృతిని సమన్వయం చేసి తెలుగు కళా వైభవాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చిన విశిష్ట ప్రతిభాశాలి అని అన్నారు.

హరికథ.. మహత్తర సాంస్కృతిక సంపద
ఆదిభట్ల ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఆనంద నారాయణదాసు మాట్లాడుతూ.. హరికథ కేవలం ఒక కళారూపం మాత్రమే కాదని, తెలుగు సాహిత్యం, సంగీతం, సంస్కృతి, ఆధ్యాత్మికతలను ఒకే వేదికపై సమన్వయం చేసే మహత్తర సాంస్కృతిక సంపద అని పేర్కొన్నారు.

ఆదిభట్ల నారాయణదాసు హరికథ వేదికపై నిలబడితే అది కేవలం ఒక కళాకారుడి ప్రదర్శన కాదని.. తెలుగు భాషా మాధుర్యం, సాహిత్య వైభవం, సంగీత గాంభీర్యం, సంస్కృతి గొప్పతనం ఒకే వేదికపై సాక్షాత్కరించే మహోత్సవమని అన్నారు. ఆయన ప్రతిభ తెలుగు కళా చరిత్రలో శాశ్వత అధ్యాయంగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.

ఆకట్టుకున్న ‘ధ్రువ చరిత్ర’ హరికథ
అనంతరం ప్రముఖ హరికథ భాగవతార్‌ బి. యతిరాజు అందించిన ‘ధ్రువ చరిత్ర’ హరికథాగానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హరికథలోని సంగీతం, గానం, కథనం ప్రేక్షకులను అలరించాయి.