News

గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు

4views

తూర్పుగోదావరి జిల్లా: గోదావరి పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఘాట్లు, ప్రముఖ ఆలయాల వద్ద రద్దీ నియంత్రణకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు సురక్షితమైన రాకపోకలు ఉండేలా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పుష్కర మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు చెప్పారు.

జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, రెవెన్యూ, పోలీస్, ఆర్ఎంసీ, దేవాదాయ తదితర శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా కోటిలింగాల ఘాట్, ఘాట్‌కు చేరుకునే మార్గాలు, ఘాట్ పరిసర ప్రాంతాలు, శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం, లూధర్‌గిరి తదితర ప్రాంతాలను పరిశీలించారు.

అదే సమయంలో ఆర్ట్స్ కళాశాల వద్ద పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. భక్తుల రాకపోకలు, పార్కింగ్, బస్సుల నిర్వహణ, నడక మార్గాలు, క్యూలైన్లు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

పుష్కరాల సమయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కోటిలింగాల ఘాట్‌కు చేరుకునే మార్గాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

భక్తులను ఒకేసారి ఘాట్ల వద్దకు అనుమతించకుండా దశలవారీగా తరలించడం ద్వారా రద్దీని సమర్థవంతంగా నియంత్రించాలని తెలిపారు. పోలీస్ శాఖ రూపొందిస్తున్న క్రౌడ్ మేనేజ్‌మెంట్ ప్రణాళికను మరింత శాస్త్రీయంగా రూపొందించి పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఘాట్ల వద్ద భక్తుల ప్రవేశం, నిష్క్రమణకు వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేసి రాకపోకలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు
కోటిలింగాల ఘాట్ వద్ద ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల ప్రవేశ మార్గం, నిష్క్రమణ మార్గం, క్యూలైన్ల నిర్వహణ తదితర అంశాలపై దేవస్థానం ఈఓతో కలెక్టర్, ఎస్పీ చర్చించారు.

పుష్కర ఘాట్ల వద్ద భక్తుల తాకిడికి అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సదుపాయాలు, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

అన్ని ఘాట్లు, ఆలయాలపై దృష్టి
పుష్కరాల సమయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పుష్కర ఘాట్లు, ప్రముఖ దేవాలయాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ప్రాంతంలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను పకడ్బందీగా ఏర్పాటు చేసి భక్తుల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

భక్తుల ఆధ్యాత్మిక అనుభూతికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అదే సమయంలో వారి భద్రత, సౌకర్యాలు, సులభమైన దర్శనం లక్ష్యంగా సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు ముందస్తు ప్రణాళికతో పనిచేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.