
( జేష్ఠ పౌర్ణమి – సంత్ కబీర్‌దాస్ జయంతి )
భారతదేశ చరిత్రలో కొందరు మహనీయులు కేవలం ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు. వారు మానవాళి మొత్తానికి మార్గదర్శకులయ్యారు. అలాంటి మహనీయుల్లో అగ్రగణ్యుడు… సంత్ కబీర్‌దాస్. భక్తి ఉద్యమానికి నూతన దిశను చూపిన కవి… సామాజిక సమానత్వాన్ని బోధించిన సంస్కర్త… కుల, మత, వర్ణ వివక్షలను తీవ్రంగా ఖండించిన ప్రజాకవి… సంత్ కబీర్‌దాస్. నేటికీ ఆయన దోహాలు భారతీయ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తూనే ఉన్నాయి.
క్రీ.శ. 15వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలోని కాశీ ప్రాంతంలో సంత్ కబీర్‌దాస్ జీవించినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన జన్మించిన కాలం భారతదేశానికి అత్యంత క్లిష్టమైన సమయం. విదేశీ ముస్లిం పాలన కొనసాగుతోంది. సమాజంలో మూఢనమ్మకాలు, కుల వివక్ష, మత విద్వేషాలు పెరిగిపోయాయి. ప్రజల్లో నిరాశ నెలకొంది. అలాంటి సమయంలో దేశవ్యాప్తంగా భక్తి ఉద్యమం ప్రారంభమైంది. భగవంతుడిని చేరుకోవడానికి కులం, మతం, జన్మ, పాండిత్యం అవసరం లేదని… నిజమైన భక్తి ఉంటే చాలని బోధించిన మహనీయుల్లో సంత్ కబీర్‌దాస్ ఒకరు.
కబీర్ దాస్ జేష్ఠ పౌర్ణమి నాడు జన్మించారు. ఈ సంవత్సరం జూన్29న ఆయన జయంతిని జరుపుకుంటున్నాము. కబీర్‌దాస్ జననానికి సంబంధించిన అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. చిన్నతనంలో తల్లిదండ్రులకు దూరమైన శిశువును చేనేత వృత్తి చేసే ముస్లిం దంపతులు నీరు, నీమా దత్తత తీసుకుని పెంచినట్లు విశ్వసిస్తారు. అందువల్ల చిన్నప్పటి నుంచే ఆయనకు హిందూ, ముస్లిం సంస్కృతుల పరిచయం ఏర్పడింది. పెద్దగా విద్యాభ్యాసం చేయకపోయినా, చిన్ననాటి నుంచే ఆధ్యాత్మికత పట్ల ఆయనకు అమితమైన ఆసక్తి ఉండేది. ప్రతిరోజూ గంగాస్నానం ముగించుకుని వస్తున్న గురువు రామానందుని పాదాలు అనుకోకుండా కబీర్‌ను తాకినప్పుడు, ఆయన నోటి నుంచి వచ్చిన “రామ… రామ…” అనే నామమే కబీర్ జీవితానికి మంత్రదీక్షగా మారిందని భక్తి సంప్రదాయం చెబుతుంది. ఆ రోజు నుంచి “రామనామమే పరమమార్గం” అని విశ్వసించిన కబీర్, జీవితాంతం భక్తి సందేశాన్ని ప్రజల్లో వ్యాప్తి చేశారు.
చేనేత వృత్తినే జీవనాధారంగా కొనసాగించిన కబీర్‌దాస్ ఎప్పుడూ సంపద కోసం పరుగులు తీయలేదు. నిరాడంబర జీవనం గడిపారు. జీవితం మొత్తం భగవంతుని స్మరణలో, సమాజ సంస్కరణలోనే గడిచిపోయింది. సంత్ కబీర్‌దాస్ చెప్పిన గొప్ప సందేశం ఏమిటంటే… భగవంతుని చేరుకోవడానికి ఆడంబరాలు అవసరం లేదు. ఖరీదైన పూజలు అవసరం లేదు. జన్మించిన కులం గొప్పది కాదు… మనసులోని భక్తే గొప్పది. అందుకే ఆయన ప్రసిద్ధ దోహాలో ఇలా అన్నారు…
“జాతి న పూఛో సాధు కీ… పూఛ్ లీజియే జ్ఞాన్…”
అంటే… ఒక సాధువు ఏ కులంలో పుట్టాడో అడగకండి. అతని వద్ద ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోండి. కత్తికి పదునే ముఖ్యం… దాని ఒర కాదు. ఈ ఒక్క దోహాలోనే భారతీయ సమాజానికి అవసరమైన సమానత్వ సందేశాన్ని కబీర్‌దాస్ అందించారు.
మహిళల పట్ల కూడా ఆయన అత్యంత గౌరవభావాన్ని వ్యక్తం చేశారు. మహిళలను తక్కువగా చూసే భావజాలాన్ని ఖండిస్తూ…”నారీ నరక న జానియే…” అనే దోహాలో… మహనీయులకు జన్మనిచ్చిన తల్లిని ఎలా అవమానించగలమని ప్రశ్నించారు.
కబీర్‌దాస్ భక్తి అంటే కేవలం భజనలు పాడటం కాదని… మానవసేవే మాధవసేవ అని విశ్వసించారు. అహింస, ప్రేమ, దయ, సమానత్వం, నిజాయితీ… ఇవే నిజమైన ఆధ్యాత్మికతకు పునాదులని బోధించారు. ఆయన రచించిన దోహాలు, పదాలు, భక్తి గీతాలు నేటికీ కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్నాయి. సిక్కుల పవిత్ర గ్రంథమైన ఆది గ్రంథ్లో కూడా కబీర్‌దాస్ రచనలు చోటు చేసుకోవడం ఆయన ఆధ్యాత్మిక ప్రభావానికి నిదర్శనం. సంత్ కబీర్‌దాస్ మనకు చెప్పిన గొప్ప సత్యం ఒక్కటే…”దేవుడు గుడిలో మాత్రమే ఉండడు… ప్రతి జీవిలో ఉంటాడు. భక్తి అంటే ఆడంబరం కాదు… ఆత్మశుద్ధి. మతం కాదు… మానవత్వం. జన్మ కాదు… గుణమే మనిషిని గొప్పవాడిని చేస్తుంది.”అందుకే… శతాబ్దాలు గడిచినా సంత్ కబీర్‌దాస్ పేరు భారత భక్తి ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా వెలుగొందుతూనే ఉంటుంది.





