
జమ్మూకశ్మీర్లో మూడు దశాబ్దాల కంటే ముందు ప్రారంభమైన ఉగ్రవాదం నేటికీ రావణకాష్టంలా మండుతూనే ఉంది. భారత పౌరులు ఉగ్ర దాడులతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి క్రమంగా మారుతోంది. జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదం మొదలైనప్పటి నుంచి నేటి వరకు చూసుకుంటే, మొదటిసారిగా ఈ మే నెలలో ఉగ్రవాద సంబంధిత మరణాలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది.
అధికారిక గణాంకాల ప్రకారం, 2026 మొదటి 5 నెలల్లో కేవలం 12 ఉగ్రవాద సంబంధిత మరణాలు మాత్రమే నమోదు అయ్యాయి. ఈ మృతుల్లో 9 మంది ఉగ్రవాదులు కాగా, మన భద్రతా దళ సిబ్బందికి చెందిన ఒకరు, గుర్తింపు వివాదం ఉన్న ఒక స్థానికుడు, గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారు. కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు ఉగ్రదాడుల్లో సాధారణ పౌరులు ఎవరూ మరణించలేదు.
జమ్మూకశ్మీర్ పోలీస్ డేటా ప్రకారం, 2000 మే నెలలో అక్కడ 288 ఉగ్రవాద సంబంధిత మరణాలు నమోదు అయ్యాయి. 2001 మే నాటికి ఈ సంఖ్య 300కు చేరింది. వాస్తవానికి ఆ సమయంలో కశ్మీర్ లోయ అంతటా, జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు, పౌరులు, భద్రతా సిబ్బంది పెద్ద సంఖ్యలో మరణించారు. దాదాపు ప్రతిరోజూ అక్కడ ఈ ఉగ్రవాద సంబంధిత మరణాలు సంభవించాయి. అయితే కాలక్రమేణా అక్కడ ఉగ్ర హింస క్రమంగా తగ్గుతూ వస్తున్నప్పటికీ, మే నెల మాత్రం అత్యంత హింసాత్మక మాసంగా ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
జీరోకు పడిపోయిన మరణాలు
అయితే ఈ ఏడాది (2026) మే నెలలో ఈ ఉగ్రవాద సంబంధిత మరణాలు సున్నాకు పడిపోయాయి. నిరంతర ఉగ్రవాద నిరోధక చర్యలు, నిఘా వర్గాల మధ్య మంచి సమన్వయం, స్థానిక యువత ఉగ్రవాద గ్రూపుల్లో చేరడం బాగా తగ్గిపోవడమే ఇందుకు కారణమని భద్రతాధికారులు చెబుతున్నారు.
పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక సీనియర్ పోలీస్ అధికారి కీలక విషయాలు వెల్లడించారు. “జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చే వ్యవస్థలు బాగా బలహీనపడ్డాయి. అలాగే కొత్తగా ఉగ్రవాదంలోకి చేరేవారి సంఖ్య చరిత్రలోనే అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. భద్రతా సంస్థలు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నాయి” అని పేర్కొన్నారు.
మీడియాతో మాట్లాడేందుకు అధికారిక అనుమతి లేని ఒక సీనియర్ ఆర్మీ అధికారి మాట్లాడుతూ, రెండు దశాబ్దాల క్రితం నాటి పరిస్థితులతో పోలిస్తే, నేడు జమ్మూకశ్మీర్లో భద్రతా వాతావరణం పూర్తిగా మారిపోయిందని చెప్పారు. “ఉగ్రవాదానికి ఊతమిచ్చే వ్యవస్థ మొత్తం ఇప్పుడు బాగా కుచించుకుపోయింది. సరిహద్దుల గుండా చొరబాట్లు ఇప్పుడు మరింత కష్టతరంగా మారాయి. ఉగ్రవాద శక్తులు క్షేత్రస్థాయిలో మళ్లీ పుంజుకోకుండా భద్రతాదళాలు సమర్థవంతంగా నిరోధించగలుగుతున్నాయి” అని ఆయన పేర్కొన్నారు.
ఉగ్రవాదం తగ్గిందా?
అధికారిక గణాంకాలు ఉగ్రవాద సంబంధిత మరణాలు తగ్గినట్లు చూపిస్తున్నప్పటికీ, ఉగ్ర ముప్పు పూర్తిగా తొలగిపోలేదని, ఉగ్రవాదాన్ని పునరుద్ధరించడానికి ముష్కరుల ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని భద్రతాధికారులు చెబుతున్నారు. అందుకే తాము నిరంతరం జమ్మూకశ్మీర్లో భద్రతా తనిఖీలు (కార్డన్ అండ్ సెర్చ్) చేస్తుంటామని పేర్కొన్నారు.





