News

పంజాబ్‌లో సెక్యూరిటీ అలర్ట్‌.. దేవాలయాలకు బాంబు బెదిరింపులు

5views

పంజాబ్‌లోని ఐదు ప్రముఖ దేవాలయాలకు బాంబు బెదిరింపు ఈమెయిల్‌ వచ్చింది. కొన్ని ప్రభుత్వ సంస్థల్లో కూడా పేలుళ్లు జరుపుతామని ఆ ఈమెయిల్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాంతో అప్రమత్తమైన వారు ఆ ఆలయాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. మరో రెండు రోజుల్లో ఆపరేషన్‌ బ్లూ స్టార్‌కు 42 ఏళ్లు పూర్తికానున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

అమృత్‌సర్‌లోని దుర్గియానా ఆలయం, పఠాన్‌కోట్‌లోని ముక్తేశ్వర్‌ ధామ్ ఆలయం, జలంధర్‌లోని దేవీ తలాబ్‌ మందిర్‌, భటిండాలోని మైసర్ ఖానా ఆలయం, పటియాలాలోని మాతాకాళీ ఆలయానికి ఈ బెదిరింపులు వచ్చాయి. ఆపరేషన్ బ్లూస్టార్‌కు 42 ఏళ్ల కావొస్తుండటంతో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు.. ఈ బెదిరింపు మెయిల్‌తో మరింత అప్రమత్తమయ్యారు. ఇప్పటికే దేవీ తలాబ్ ఆలయం వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని వెల్లడించారు. ప్రజలను భయపెట్టే ఉద్దేశంతో చేసిన నకిలీ బెదిరింపులుగా కనిపిస్తున్నప్పటికీ.. ఎలాంటి రిస్క్‌ తీసుకోబోమన్నారు.

1984 జూన్‌లో ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ కొనసాగింది. ప్రార్థనాలయంలో దాక్కున్న తీవ్రవాదులను పట్టుకునేందుకు భారత సైన్యం సైనిక చర్య చేపట్టింది. మేజర్‌ జనరల్‌ బ్రార్‌ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ ‘ఆపరేషన్‌ బ్లూ స్టార్‌’.. భారత సైన్యం చేపట్టిన అతిపెద్ద సైనిక చర్యల్లో ఒకటిగా నిలిచింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు చేపట్టిన ఆ సైనిక చర్యలో 83 మంది భారత సైనికులు అమరులయ్యారు. వేర్పాటువాద నేత భింద్రన్‌ వాలేతో పాటు ఇతర వేర్పాటువాద నేతలూ హతమయ్యారు