News

గుజరాత్‌లో ₹226 కోట్ల అంతర్జాతీయ క్రిప్టో-టెర్రర్ ఫండింగ్ నెట్‌వర్క్ గుట్టురట్టు: 9 మంది అరెస్ట్

0views
గుజరాత్ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా కలకలం రేపిన 226.54 కోట్ల రూపాయల భారీ క్రిప్టో కరెన్సీ-టెర్రర్ ఫండింగ్ నెట్‌వర్క్‌ను విజయవంతంగా ఛేదించారు. ఈ అంతర్జాతీయ ముఠాకు డార్క్ వెబ్ మాదకద్రవ్యాల వ్యాపారం, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి అహ్మదాబాద్, ముంబై, కర్నాల్ వంటి వివిధ నగరాల్లో దాడులు చేసి మొహ్సిన్ సలావుద్దీన్ మోలాని, మొహమ్మద్ హుస్సేన్, ఇసామ్ అన్సారీ సహా మొత్తం తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ముఠా కార్యకలాపాలు భారతదేశం, దుబాయ్, యునైటెడ్ కింగ్‌డమ్ (UK) వ్యాప్తంగా విస్తరించాయి. నిందితుల్లో ఒకరైన మొహ్సిన్ మోలాని డిజిటల్ వాలెట్‌ను పరిశీలించగా, ‘ఆర్టెమిస్‌ల్యాబ్’ అనే డార్క్ వెబ్ డ్రగ్ సైట్ నుండి జరగిన అక్రమ లావాదేవీలను పోలీసులు గుర్తించారు. దుబాయ్ వేదికగా పనిచేసే మొహమ్మద్ జుబేర్ పోపటియా అనే మరో నిందితుడి క్రిప్టో వాలెట్‌ను ఇజ్రాయెల్ కౌంటర్ టెర్రర్ ఫైనాన్సింగ్ విభాగం గతంలోనే బ్లాక్ చేసింది. ఇక మరో కీలక సూత్రధారి ఇసామ్ అన్సారీ ప్రస్తుతం డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో బ్రిటన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.

ఈ ముఠా దేశంలోని అమాయకులను సైబర్ మోసాల ద్వారా దోచుకున్న డబ్బును, అలాగే డ్రగ్స్ అమ్మకాల ద్వారా వచ్చిన నల్లధనాన్ని వ్యవస్థీకృత పద్ధతిలో లాండరింగ్ చేసింది. భారతదేశంలోని నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో నమోదైన సుమారు 935 సైబర్ ఫిర్యాదులతో ఈ నిందితుల బ్యాంక్ ఖాతాలకు లింకులు ఉన్నాయి. వీరు పట్టుబడకుండా ఉండేందుకు సాధారణ నగదును మొదట ‘మొనెరో’ (XMR) వంటి గోప్యమైన క్రిప్టో కరెన్సీలుగా మార్చి, ఆపై ‘టెథర్’ (USDT) స్థిర కరెన్సీ రూపంలోకి మార్చుకుని హవాలా మార్గాల ద్వారా విదేశాలకు తరలించారు.

బ్లాక్‌చైన్ సాంకేతికత ఆధారంగా జరిపిన లోతైన విశ్లేషణలో ఈ నిధులు హమాస్, యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్, ఇరాన్ దేశపు ఐఆర్జిసి-క్యూఎఫ్ (IRGC-QF) వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు చేరినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అలాగే అంతర్జాతీయంగా నిషేధాన్ని ఎదుర్కొంటున్న రష్యాకు చెందిన ‘గ్యారంటెక్స్’ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌తో కూడా వీరికి లావాదేవీలు ఉన్నట్లు స్పష్టమైంది. ఈ ముఠా వెనుక ఉన్న మిగతా అంతర్జాతీయ శక్తులను పట్టుకోవడానికి గుజరాత్ పోలీసులు ప్రస్తుతం కేంద్ర నిఘా సంస్థలు, అంతర్జాతీయ పోలీసు విభాగాలతో కలిసి దర్యాప్తును వేగవంతం చేశారు.