
దిల్లీ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. దిల్లీ, ముంబయి సహా దేశంలో పలుచోట్ల దాడులకు ప్రణాళిక రచించిన తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. వారికి పాకిస్థాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ -ISI, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
నిందితుల్లో దిల్లీ, ముంబయి, పంజాబ్‌కు చెందిననవారితో పాటు విదేశీయులు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. భారత్‌లో దాడులు చేసేలా ఈ మాడ్యూల్‌కు ఐఎస్‌ఐ శిక్షణ ఇచ్చిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కీలక భవనాలు, భద్రతాసిబ్బంది లక్ష్యంగా దాడి చేయడమే వారికి అప్పగించిన పని పేర్కొన్నాయి. దిల్లీలోని రద్దీ ప్రదేశాలు, కీలక భవనాలపై ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందంటూ నిఘా వర్గాల నుంచి భద్రతా సంస్థలకు ఈ నెలలో సమాచారం అందింది. 2025 నవంబరు 10న దేశ రాజధాని దిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 15 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా వర్గాల సమాచారంతో దేశ రాజధాని హై అలర్ట్‌లో ఉంది.





