
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరినీ స్వాగతించే ఓ దేశం చూపండి అంటూ సవాల్ విసిరారు. సీఏఏపై విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎకనామిక్ టైమ్స్ నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో శనివారం జయశంకర్ మాట్లాడారు.
శరణార్థుల సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో సీఏఏను తీసుకొచ్చామని జయశంకర్ వివరించారు. దీన్ని కొనియాడాల్సింది పోయి విమర్శలు చేయడం తగదన్నారు. ‘ప్రపంచంలో అందరినీ స్వాగతించే ఓ దేశం చూపండని ఎవర్నైనా అడిగితే ఏ ఒక్కరూ చూపలేరు” అని వ్యాఖ్యానించారు. దేశీయ ప్రయోజనాల కోసమే ఆర్‌సెప్ నుంచి బయటకొచ్చినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జమ్మూకశ్మీర్ అంశంపై యూఎన్‌హెచ్‌ఆర్‌సీ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దాని గురించి మాట్లాడే ముందు ఆ అంశంపై గతంలో యూఎన్‌హెచ్‌ఆర్‌సీ వ్యవహరించిన తీరు ఓ సారి మననం చేసుకోవాలని జయశంకర్ సూచించారు. ప్రపంచంలో మన మిత్రులను కోల్పోతున్నామా? అన్న ప్రశ్నకు మన నిజమైన స్నేహితులెవరో తెలుసుకొనే సమయం ఆసన్నమైందంటూ జయశంకర్ సమాధానం ఇచ్చారు.





