
‘వందేమాతరం’కు జాతీయ గీతం ‘జన గణ మన’తో సమానంగా చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వందేమాతరం ఒక దేవతను కీర్తించే గీతమని, దానిని జాతీయ గీతంతో సమానంగా చూడలేమని ఆయన స్పష్టం చేశారు.
ఓవైసీ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా స్పందించారు. ఎంఐఎం నాయకత్వం సాంస్కృతిక ఏకీకరణను తమ మతపరమైన ప్రత్యేకవాదానికి ముప్పుగా భావిస్తుందని ఆయన విమర్శించారు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వందేమాతరంను వ్యతిరేకించని జిన్నా, పార్టీని వీడాకే వ్యతిరేకించడం మొదలుపెట్టారని, ఓవైసీ కూడా అదే బాటలో పయనిస్తున్నారని అన్నారు. ఉమ్మడి పౌరస్మృతి, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి ప్రతి అంశాన్ని ఎంఐఎం వ్యతిరేకిస్తోందని, మతపరమైన ప్రత్యేకవాదంతో తమ రాజకీయ ప్రాధాన్యతను కాపాడుకోవడానికే ఇలాంటి వ్యతిరేకత చూపుతున్నారని రావు ఆరోపించారు.
1971 నాటి జాతీయ గౌరవ చిహ్నాల అవమానాల నిరోధక చట్టానికి సవరణలు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సవరణతో ఇకపై వందేమాతరం గానానికి ఆటంకం కలిగించడం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది. తద్వారా జన గణ మనతో సమానమైన చట్టబద్ధమైన రక్షణ వందేమాతరానికి లభించనుంది.





