News

దేశ ఉత్థానంలోనే మన సార్థకత : మోహన్ భాగవత్

35views

భారత దేశ ఉత్థానంలోనే మన సార్థకత దాగి వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.ప్రొఫెసర్ యశ్వంత రావు కేల్కర్ శతజయంతిని పురస్కరించుకొని, విదర్భలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ‘‘ప్రియ యశ్వంత రావు’’ పేరిట ఓ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మోహన్ భాగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యశ్వంత రావు అందరి ముందూ ఆదర్శంగా నిలబడ్డారని, ఇకపైనా నిలుస్తారన్నారు. యావత్ సమాజాన్ని సంఘటితం చేసే కార్యకర్తకు ఎలాంటి గుణాలు వుండాలో, కేల్కర్ కి అవన్నీ వున్నాయన్నారు.

డాక్టర్ హెడ్గేవార్ ప్రతిపాదించిన కార్య పద్ధతి, ఆలోచనలు నేటికీ ఆచరణయోగ్యంగా వున్నాయా? భవిష్యత్తులో కూడా ఆచరణయోగ్యమా? అన్న ప్రశ్నలకు కేవలం తర్కం ద్వారానే సమాధానం చెప్పవచ్చన్నవారు. ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన కార్య పద్ధతి, ఆలోచనలు శాశ్వతమైనవన్నారు. మానవాళి ఉన్నంత వరకూ ఇవి సమాజంలో వుంటూనే వుంటాయన్నారు. ఎందుకంటే అవి శాశ్వతమైనవని, యశ్వంతరావు కేల్కర్ ప్రతిపాదించిన పద్ధతి కూడా ఇదే విధంగా శాశ్వతమైందని ప్రకటించారు. ఆ సూత్రాలు ఎప్పటికీ మసకబారవని అన్నారు.

అయితే.. ఈ పద్ధతిలో పనిచేసే వారు, జీవితాన్ని గడిపేవారి వ్యక్తుల పరంపర నిరంతరం కొనసాగుతూనే వుంటుందని భాగవత్ తెలిపారు. ఎందుకంటే ఇది మన దేశ సంప్రదాయం అని, ఇది ప్రాచీన కాలంలో ప్రారంభమై, నేటికీ కొనసాగుతూనే వుంటోందన్నారు. మన ఉనికి ఎన్నటికీ చెరిగిపోకుండా చూసే శక్తి మనలోనే అంతర్లీనంగా వుందని, స్తిత్వంలోని మౌలిక సత్యాలను గుర్తించి, దానికి అనుగుణంగా నడుచుకునే సంప్రదాయాన్ని తమ జీవితాలలో అంతర్గతంగా ఆకళింపు చేసుకుంటామన్నారు. అలాగే అలా మూర్తీభవించిన వ్యక్తుల అవిచ్ఛిన్నమైన పరంపరలోనే ఇదంతా వుందని, మన కార్యాచరణ అనేది మన విధానంలోనే అంతర్భాగమైపోయిందని వివరించారు.

తామే మా పనిలో నిమగ్నమైనా, బయటి పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుంటామని, దీని ద్వారా తరుచూ అనేక ప్రశ్నలు వస్తుంటాయని, సంస్థ స్థితిగతులు కూడా మారుతూ వుంటాయన్నారు. కొన్ని సార్లు అనుకూలంగా, మరికొన్ని సార్లు ప్రతికూలంగా వుంటాయన్నారు.కేల్కర్ ప్రత్యక్షంగా విద్యార్థ పరిషత్ ను విస్తరించి, దానిని ఓ శక్తిమంతమైన సంస్థగా తీర్చిదిద్దారని ,అయితే నేడు పరిస్ధితులు మారిపోయాయన్నారు.

నేడు అనుకూలమై కాలం వచ్చిందని, తత్ఫలితంగా అన్ని రకాల సదుపాయాలూ అందుబాటులోకి వచ్చాయన్నారు. వాటన్నింటినీ మన కార్య విస్తరణ కోసం వినియోగించుకోవడం అందరి విధి అని ఉద్బోధించారు. అయితే.. ఈ సదుపాయాలు మన స్వార్థం కోసం కాకుండా, కేవలం కార్య విస్తరణ కోసమే వున్నాయన్న సత్యాన్ని గ్రహించాలని, ఆ సదుపాయాలకు మనమే అధిపతులంగా వుండాలి కానీ, అది మనపై ఆధిపత్యం చెలాయించవద్దని అన్నారు.

శివరాయల సన్నిధిలో “ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి మరియు ఎలా నవ్వాలి” అనే విషయాలపై సమర్థ రామదాస స్వామి శంభాజీ మహారాజుకు అందించిన ఉపదేశం మనకూ ఒక ఆదర్శంగా నిలుస్తుంది: అదేమిటంటే, ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ప్రతి ఒక్క సద్గుణాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసి, వాటిని అనుసరించడం.’’ అని తెలిపారు.

విద్యార్థి పరిషత్ పని చేయాలంటే మనకు ఎలాంటి ఆదర్శాలు కావాలి? మనల్ని మనమే ఈ ప్రశ్న వేసుకోవాలి. ‘‘యశ్వంత రావు అయితే ఏమి చేసి వుండేవారు? అని ఆలోచించుకోవాలి. మనం ఆయన్ను అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. మన చుట్టూనే ఎన్నో సమకాలీన ఉదాహరణలు ఉన్నాయి; వాటి నుండి స్ఫూర్తి పొందుతూ, మనం ముందుకు సాగవచ్చు.భవిష్యత్ తరాలకు మనమే స్వయంగా ఒక ఆదర్శంగా నిలవాలి. ఆ ఆదర్శాన్ని మనం పూర్తిగా ఆచరణలో పెట్టగలమో లేదోనని చింతించకుండా, మనం నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి.’’ అని మోహన్ భాగవత్ అన్నారు.