
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో వైశాఖ పౌర్ణమి సందర్బంగా విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం ఘాట్ రోడ్డు మొదట్లో ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శీనునాయక్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టారు. తప్పెట్లు, కోలాటం, నృత్య ప్రదర్శనలు, భజన సంకీర్తనా గానం, కళా బృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఘాట్ రోడ్ అమ్మవారి గుడి, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి నుంచి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం.





