News

ఘనంగా సింహాచలం అప్పన్న చందనోత్సవం

57views

సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవం ఘనంగా జరుగుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. తెల్లవారుజామున ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కుటుంబం స్వామివారికి తొలి చందన సమర్పణ చేసి దర్శనం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోం మంత్రి అనిత స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం టిటిడి  దేవస్థానం స్వామికి పట్టువస్త్రాలు సమర్పించింది. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.

స్వామివారి నిజరూప దర్శనానికి లక్షల మంది భక్తులు తరలిరానుండటంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. చందనోత్సవాన్ని పురస్కరించుకుని అప్పన్న స్వామి ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. అంతరాలయంతో పాటు ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలు, ధ్వజస్తంభం, కల్యాణ మండపం ప్రాంగణాలకు పుష్పాలంకరణ చేశారు. ఆలయానికి రంగు రంగుల విద్యుద్దీపాలను అలంకరించారు. ఎక్కడికక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేసి భక్తులకు సులభంగా మార్గదర్శనం కలిగేలా చర్యలు తీసుకున్నారు.