News

సర్దార్ పటేల్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను వర్ణించే చిత్రాలు- గుజరాత్‌ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శన

69views

దేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితంలో ముఖ్య ఘట్టాలను వర్ణించే 150 బ్లాక్ అండ్ వైట్ పెయింటింగ్స్‌ను గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని ‘ఊర్మిళ కనోరియా ఆర్ట్ సెంటర్‌’లో జరిగిన ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న ‘శ్రీ ప్రకాశ్​ విద్యానికేతన్’ పాఠశాల విద్యార్థులు రూపొందించిన ఈ సర్దార్ పటేల్ చిత్రపటాలు కేవలం కళాఖండాలు మాత్రమే కాదు. ఇవి భారతదేశ కళా చరిత్రను కూడా కళ్లకు కడుతున్నాయి. ఇవి చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

వైజాగ్ విద్యార్థులు రూపొందించిన కళాఖండాలు
‘సర్దార్ పటేల్ @ 150’అనే నినాదంతో వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏపీలోని విశాఖపట్నంలో ఉన్న శ్రీ ప్రకాశ్​ విద్యానికేతన్ పాఠశాల అహ్మదాబాద్‌లోని ‘ఊర్మిళ కనోరియా ఆర్ట్ సెంటర్’లో ఈ పెయింటింగ్స్ ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయగా మంచి స్పందన వచ్చింది. ఏప్రిల్ 7- ఏప్రిల్ 9 వరకు మూడు రోజుల పాటు సాగిన ఈ 150 చిత్రపటాల ఎగ్జిబిషన్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం సర్దార్ పటేల్ చేసిన సేవలను స్మరించుకోవడం, కళా మాధ్యమం ద్వారా దేశభక్తిని చాటిచెప్పడమే.

ఇదే విషయంపై శ్రీ ప్రకాశ్​ విద్యానికేతన్ పాఠశాల డైరెక్టర్ వాసు విజయ్ చిట్టూరి స్పందించారు. సర్దార్ పటేల్‌పై రూపొందించిన ఈ 150 పెయింటింగ్స్ ప్రదర్శనను గుజరాత్‌లో నిర్వహించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఉందన్నారు. దేశ నిర్మాణంలో సర్దార్ పటేల్ పోషించిన కీలక పాత్రను గౌరవించడం, అలాగే కళా మాధ్యమం ద్వారా ఆయన జీవిత చరిత్రకు, సేవలకు నివాళులర్పించడమేనని తెలిపారు.

ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న శైలజా కిరణ్
అహ్మదాబాద్‌లోని ఊర్మిళ కనోరియా ఆర్ట్ సెంటర్‌లో సర్దార్ పటేల్‌ జీవితంలో ముఖ్య ఘట్టాలను వర్ణించే 150 చిత్రపటాలను ప్రదర్శించారు. దేశానికి ఉక్కు మనిషి చేసిన సేవలను, ఆయన ఆదర్శాలను తన జన్మస్థలమైన గుజరాత్ ప్రజలకు తెలియజేయడం కోసం ఇలా అక్కడ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ చిత్రపటాల ప్రదర్శన ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కూడా జరిగింది. ఆ ఎగ్జిబిషన్‌ను మార్గదర్శి చిట్‌ఫండ్ ఎండీ శైలజా కిరణ్ ప్రారంభించారు. 6-10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు రూపొందించిన సర్దార్ పటేల్‌ జీవితాన్ని వర్ణించే 150 బ్లాక్ అండ్ వైట్ పెయింటింగ్స్‌ను ఆ సందర్భంగా ప్రదర్శించారు.

ఈ ఎగ్జిబిషన్‌లో శ్రీ ప్రకాశ్​ విద్యానికేతన్ పాఠశాలకు చెందిన మొత్తం 80 మంది విద్యార్థులు రూపొందించిన 150 బ్లాక్ అండ్ వైట్ పెయింటింగ్స్‌ను ప్రదర్శించారు. ఈ చిత్రపటాల ద్వారా సర్దార్ పటేల్ జీవితంలోని వివిధ కోణాలను, కుటుంబ జీవితాన్ని, వివిధ ఉద్యమాలలో ఆయన నాయకత్వం, స్వాతంత్ర్య పోరాట సమయంలో ఇతర నాయకులతో ఆయన జరిపిన సంభాషణలను ఈ ప్రదర్శన కళ్లకు కడుతోంది. అలాగే స్వాతంత్ర్య ఉద్యమం, దేశ విభజన వంటి కీలక సంఘటనలు సజీవంగా కళ్లకు కడుతోంది. ఈ ఎగ్జిబిషన్‌ను సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపక సంచాలకులు, పద్మశ్రీ కార్తికేయ సారాభాయ్, ప్రముఖ కళా విమర్శకులు అనిల్ రెలియా ప్రారంభించారు. ఆ తర్వాత అనేక మంది కళాభిమానులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు ఈ చిత్రపటాలను వీక్షించారు.

150 బ్లాక్ అండ్ వైట్ చిత్రపటాలను రూపొందించిన విద్యార్థులు
సర్దార్ పటేల్ జీవితం, దేశం కోసం ఆయన చేసిన కృషికి సంబంధించిన వివిధ కోణాలను తెలిపే సమాచారాన్ని తమకు స్కూల్ యాజమాన్యం అందించిందని శ్రీ ప్రకాశ్ విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు తెలిపారు. ఈ ఛాయాచిత్రాల నుంచి స్ఫూర్తి పొంది 80 మంది విద్యార్థులు కలిసి 150 బ్లాక్ అండ్ వైట్ చిత్రపటాలను రూపొందించామని వెల్లడించారు. ఇవి పటేల్ జీవితంలోని వివిధ సంఘటనలను, కీలక క్షణాలను వర్ణిస్తాయని చెప్పుకొచ్చారు. సర్దార్ పటేల్ జీవితంపై, దేశ నిర్మాణంలో ఆయన పోషించిన పాత్రపై దృష్టి సారించే క్రమంలో తాము భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుల జీవితాలకు సంబంధించిన విషయాలను గ్రహించామని అన్నారు.