News

అక్కడ బూతులు మాట్లాడితే ఫైన్ లేదా శిక్ష- తిట్లే లేని తొలి గ్రామంగా గుర్తింపు

121views

గ్రామం అంటే అందరూ కలిసి ఉండటమే కాదు అప్పుడప్పుడు చిన్న చిన్న వివాదాలు వంటివి కూడా జరుగుతుంటాయి. ఆ చిన్న వివాదాలకు బూతులు తోడైతే ఆ గొడవ పెద్దది అవుతుంది. కొన్ని సందర్భాల్లో అసభ్య పదజాలంతో కూడా గొడవలు పడుతుంటారు. కానీ ఇందుకు భిన్నంగా మధ్యప్రదేశ్​లోని ఓ గ్రామం ఉంది. అక్కడ ప్రజలు అసలు బూతులే మాట్లాడారంట. ఒకవేళ ఎవరైనా బూతులు మాట్లాడితే వెంటనే జరిమానా లేదా శిక్షను విధిస్తారు. ఈ ప్రత్యేకతో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

మధ్యప్రదేశ్​లోని బురహాపుర్ జిల్లా బోర్​సర్​ రాష్ట్రంలోనే తొలి బూతు పదాల రహిత గ్రామంగా గుర్తింపు పొందింది. జిల్లా కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో సుమారు 6 వేల మంది జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ ఎవరైనా బూతులు మాట్లాడితే వెంటనే జరిమానా విధించడం ప్రత్యేకతగా నిలిచింది. గ్రామంలో ఎవరైనా బూతులు రూ.500 జరిమానా విధిస్తారు. లేకపోతే ఒక గంటపాటు గ్రామంలో శుభ్రతకు సంబంధించిన పనులు చేయాల్సి ఉంటుంది. ఈ నియమం ధనిక, పేద తేడా లేకుండా అందరికీ వర్తించేలా అమలు చేస్తున్నారు.

పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు
గ్రామ సర్పంచ్ అంతర్‌సింగ్‌, ఉపసర్పంచ్ వినోద్ శిందే, అలాగే నటుడు అశ్విన్ పాటిల్ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో సంస్కారాలను పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందుకోసం గ్రామంలోని ప్రతి వార్డులో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ నియమాలను పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూస్తున్నారు. గ్రామమంతా పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఫ్రీ వైఫై, లైబ్రరీతో జ్ఞాన విస్తరణ
కేవలం బోర్​సర్ బూతులు రహిత గ్రామంగానే కాదు, అభివృద్ధి వైపూ కూడా అడుగులు వేస్తోంది. పిల్లల నుంచి యువత వరకు అందరికీ ఉపయోగపడేలా గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు చేశారు. అందులో ధార్మిక గ్రంథాలు, సాధారణ జ్ఞానం పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే గ్రామంలో నాలుగు ప్రదేశాల్లో ఫ్రీ వైఫై ఏర్పాటు చేసి, ప్రతి ఒక్కరికి ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు.

హరిత గ్రామం లక్ష్యం కోసం మొక్కల పంపిణీ
హరిత గ్రామంగా మార్చాలనే లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు. అందుకోసం ప్రతి ఇంటికి పచ్చదనం అనే కార్యక్రమం కింద గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేస్తున్నారు. అలాగే గ్రామంలో సేవాభావ కేంద్రం ప్రారంభించారు. దాతలు అందించిన వస్తువులను అవసరమైన వారికి అందిస్తున్నారు. మత, జాతి భేదం లేకుండా అందరూ ఈ సేవలను వినియోగించుకోవచ్చు.

‘తిట్లే కారణమని గుర్తించా’
ముంబయి నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాక గ్రామస్థులు గొడవలు పడటం చూశానని నటుడు అశ్విన్ పాటిల్ అన్నారు. ’10 సంవత్సరాలు ముంబయిలో ఉన్నా. ఆ తర్వాత స్వగ్రామానికి వచ్చినప్పుడు చిన్న చిన్న గొడవలు కూడా పెద్ద వివాదాలుగా మారడాన్ని చూశాం. వివాదాలను కారణం ఆ తిట్లే అని గుర్తించా. అప్పుడే నేను గ్రామ స్పరంచ్ అంతర్​సింగ్, ఉపస్పరంచ్ వినోద్ శిందేతో సంప్రదించా. వారు ఒక సమావేశం ఏర్పాటు చేసి, అందరి సమక్షంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఎవరూ అసభ్య పదజాలం వాడకూడదని ఉత్తర్వు జారీ చేశారు. అన్నిచోట్లా పోస్టర్లు పెట్టారు’ అని అశ్విన్ పాటిల్ పేర్కొన్నారు.

గ్రామాభివృద్ధికి కొత్త కార్యక్రమాలు
గ్రామాభివృద్ధి కోసం అశ్విన్ పాటిల్ అనేక సూచనలు చేశారని ఉప సర్పంచ్ వినోద్ శిందే అన్నారు. యువతకు ఫ్రీ ఇంటర్నెట్ అందిస్తున్నారని, గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. అలాగే పిల్లల కోసం లైబ్రరీ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం గ్రామస్తులకు ఎంతో ఉపయోగకరంగా మారిందని తెలిపారు.