
2027 జనగణన తొలి విడతలో భాగంగా నిర్వహిస్తున్న గృహ గణన(HLO)లో ఇప్పటివరకు 5.72 లక్షలకు పైగా కుటుంబాలు స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) సౌకర్యాన్ని వినియోగించుకున్నాయి. ఈ విషయాన్ని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్‌జీఐ) మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ వెల్లడించారు. ఈ అంశం జనగణనతో ముడిపడిన డిజిటల్ సదుపాయాల్లో పెరుగుతున్న ప్రజా భాగస్వామ్యాన్ని అద్దం పడుతోందని ఆయన తెలిపారు. లక్షలాది కుటుంబాలు ఆన్‌లైన్‌లోనే గృహ గణన సమాచారాన్ని సమర్పించడం ద్వారా దేశ నిర్మాణం కోసం వేగవంతమైన, స్మార్ట్‌గా, సౌకర్యవంతంగా ఉండే మార్గాన్ని ఎంచుకున్నారని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆర్‌జీఐ ఒక ట్వీట్ చేశారు.
స్వీయ గణన – ఐడీ జనరేషన్ – వెరిఫికేషన్
దేశంలో తొలి విడత గృహ గణన ప్రక్రియ ఏప్రిల్ 1న 5 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమైంది. ఈ జాబితాలో గోవా, కర్ణాటక, మిజోరాం, ఒడిశా, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, దిల్లీ (న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్ – NDMC ప్రాంతం, దిల్లీ కంటోన్మెంట్ బోర్డు పరిధి మాత్రమే) ఉన్నాయి. ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని కుటుంబాలు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. కుటుంబాలకు స్వీయ గణన చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం ఇదే తొలిసారి. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను (https://se.census.gov.in/) రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. దీనిలో అడిగే ప్రశ్నలకు ప్రజలు స్వయంగా సమాధానాలను నమోదు చేయొచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చాక, ఎస్‌ఈ ఐడీ (Self-Enumeration ID) జనరేట్ అవుతుంది. తదుపరిగా ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు జరగనున్న డోర్ టు డోర్ గృహ గణన సందర్భంగా వెరిఫికేషన్ కోసం తమ ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు ఎస్‌ఈ ఐడీని ప్రజలు అందిస్తారు.
ప్రత్యేక మొబైల్ యాప్ – ప్రతీ కుటుంబానికి 33 ప్రశ్నలు
మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరుగుతున్న 8వ జనగణన ఇది. దీన్ని రెండు దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశలో ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు విడతలవారీగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో(యూటీలు) గృహ గణన జరుగుతుంది. రాష్ట్రాలు, యూటీలు తమ సౌలభ్యాన్ని బట్టి గరిష్ఠంగా 30 రోజులు కూడా ఈ ప్రక్రియను నిర్వహించుకోవచ్చు. తొలుత అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 15 రోజుల పాటు స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) కోసం ప్రజలకు అవకాశం ఇస్తారు. ఆ గడువు ముగిసిన మరుసటి రోజు నుంచే ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్ మొదలుపెడతారు. ప్రతీ ఇంటికి చెందిన కుటుంబాన్ని 33 ప్రశ్నలు అడిగి సమాధానాలను నమోదు చేస్తారు. కుటుంబ పెద్ద సమాచారం, పేరు, లింగం, ఇంటి యాజమాన్యం వివరాలు, ఇంట్లోని కనీస వసతులపైనే ఈ ప్రశ్నలన్నీ ఉంటాయి. ఈ సమాచారం నమోదు కోసం ఎన్యుమరేటర్లు ప్రత్యేక మొబైల్ యాప్‌ను వినియోగిస్తారు. మొత్తం మీద ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గా జరుగుతుంది. ఇక జనగణన రెండో దశ 2027 ఫిబ్రవరిలో మొదలవుతుంది. అయితే మంచుతో కూడిన లద్ధాఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి చోట్ల 2026 సెప్టెంబరులోనే జనగణన రెండో దశ ప్రక్రియను నిర్వహిస్తారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎప్పుడు?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సెల్ఫ్ ఎన్యుమరేషన్ వేర్వేరు తేదీల్లో జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో సెల్ఫ్ ఎన్యుమరేషన్ కాలపరిమితి ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉంటుంది. ఇంటింటి సర్వే మే 1 నుంచి మే 30 వరకు జరుగుతుంది. తెలంగాణలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ కాలపరిమితి ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఉంటుంది. ఇంటింటి సర్వే మే 11 నుంచి జూన్ 9 వరకు జరుగుతుంది. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు.





