
జాతీయ చైతన్యం, ఆధ్యాత్మికత అన్న సమ్మిళితం ద్వారానే బలమైన దేశాన్ని నిర్మించగలమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ కృష్ణగోపాల్ అన్నారు. విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ వారి 2026 వార్షిక సర్వసభ్య సమావేశం న్యూఢిల్లీలో జరిగింది.ఇందులో రవీంద్ర కన్హేరే (అఖిల భారత అధ్యక్షులు), దేశ్‌రాజ్ జీ (ప్రధాన కార్యదర్శి), గోవింద్ జీ మహంత్ (సంఘటనా కార్యదర్శి), రోహిత్ వాస్వానీ (కోశాధికారి) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయత, ఆధ్యాత్మిక దృక్పథంపై ఆధారపడి, విద్యా భారతి ఓ బలమైన విద్యా సంస్థగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ఈ మూలాలను ఆధారంగా చేసుకొనే విద్యా భారతి తన పాత్రను నిరంతరం విస్తరిస్తూనే వుందని అన్నారు. ఈ సందర్భంగా “ఏకం సత్ విప్రా బహుధా వదంతి” అనే సూత్రాన్ని ప్రస్తావించారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతదేశ సాంస్కృతిక బలాన్ని ఆయన ప్రత్యేకంగా వివరించారు.
విద్య ఉద్దేశం కేవలం జ్ఞాన విస్తరణ మాత్రమే కాదని, విద్యార్థులలో నిబిడీకృతమైన జాతీయ భావాలను పెంపొందించడం అని, అలాగే ఆధ్యాత్మిక విలువలను నెలకొల్పడం అని వివరించారు. వీటితో పాటు విద్యార్థులలో జీవితం పట్ల సమగ్ర దృక్పథం అలవర్చడమేనని అన్నారు. వీటన్నింటినీ సమన్వయం చేసే విద్యా దృక్పథం విద్యాభారతి లో వుందన్నారు.
జాతీయ చైతన్యం, ఆధ్యాత్మి మూలాలపై అవగాహన, విలువల ఆధారిత విద్యార్థులను తీర్చిదిద్దడమే విద్య లక్ష్యమని వివరించారు. సమకాలీన సమాజంలో స్వార్థం పెరిగిపోతోందని, భౌతికవాద ధోరణులు అసహనానికి దారి తీస్తున్నాయని అన్నారు. జాతీయవాదాన్ని ఆధ్యాత్మికతతో సమన్వయం చేయడంలోనే సమస్యలన్నింటికీ పరిష్కారం వుందన్నారు.
ఇక.. AI గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. సాంకేతికత ఉపయోగకరమేనని, అయితే.. మానవ సున్నితత్వానికి, సృజనాత్మకతకు, విలువలకు మాత్రం ప్రత్యామ్నాయం కాదని తేల్చి చెప్పారు.లౌకిక విద్యతో పాటు, ప్రతి విద్యార్థికి ఆధ్యాత్మిక దృక్పథాన్ని పెంపొందించడం అత్యవసరమని; తద్వారా వారు ఒక సార్థకమైన, విలువలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతారని నొక్కి చెప్పారు. విద్యా భారతి చేపడుతున్న కృషి, డాక్టర్ హెడ్గేవార్ మౌలిక భావనల విస్తృత రూపమని, ఇది దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.





