ArticlesNews

తెనాలి ప్రజల పోరాట పటిమకు నిలువెత్తు నిదర్శనం రణరంగ చౌక్

42views

( 1942 ఆగస్టు 12 – అమరవీరుల స్మారకంగా రణరంగ చౌక్ ఏర్పాటు )

బ్రిటిష్ పాలకులు స్థాపించిన కాంగ్రెస్ సంస్థ, వారే భారతదేశం వదిలిపెట్టి పోక తప్పదంటూ పిలుపునిచ్చిన సందర్భం క్విట్ ఇండియా ఉద్యమం. 1942 ఆగస్టు 8న ఏఐసీసీ సమావేశంలో గాంధీ ‘భారత్ ఛోడో’… అంటే ‘భారతదేశాన్ని వదిలిపొండి’ అనే పిలుపునిచ్చారు. ఆగస్టు 9న ప్రధాన నాయకులు అందరినీ నిర్బంధించిన బ్రిటిష్ ప్రభుత్వం, ఉద్యమం చల్లారిపోతుందని భ్రమించింది. అప్పటికే తెల్లవారి అరాచకాలతో విసిగి వేసారిపోయిన సామాన్య ప్రజలు తమ పోరాటాన్ని తీవ్రతరం చేసారు.

క్విట్ ఇండియా ఉద్యమ నిర్మాణం, సమాయత్తత కోసం బొంబాయిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆనాటి గుంటూరు జిల్లా నేతలు కల్లూరి చంద్రమౌళి, వెలువోలు సీతారామయ్య, పుతుంబాక శ్రీరాములు, అవుతు సుబ్బారెడ్డి, శరణు రామస్వామి తదతరులు తెనాలి వచ్చారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆగస్టు 11న కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టులను నిరసిస్తూ ఆగస్టు 12న పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. కల్లూరి చంద్రమౌళి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నన్నపనేని వెంకట్రావు, కార్యదర్శి రావి అమ్మయ్య నేతృత్వంలో తెనాలి తాలూకా హైస్కూలు, భారత్ ట్యుటోరియల్ కాలేజి విద్యార్థులు సహా వేలాదిమంది ఆ బంద్‌లో పాల్గొన్నారు.

కాంగ్రెస్ నాయకులు స్వయంగా పురవీధుల్లో తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. రైల్వేస్టేషను సమీపంలో తెరచివున్న హోటలును ధ్వంసం చేసారు. పక్కనే స్పెన్సర్‌ క్యాంటీన్‌లో ఉన్న మద్యం సీసాలను పగలగొట్టారు. రైల్వేస్టేషన్ నార్త్ క్యాబిన్ దగ్గరలోని ఆయిల్ ట్యాంకరుకు నిప్పటించారు. రెండు వ్యాగన్ల నిండా ఉన్న సిగరెట్ బండిల్స్‌ను ప్లాట్‌ఫామ్‌పై తగులబెట్టారు. అప్పుడే చెన్నై నుంచి వచ్చిన పాసింజరు రైలులోంచి ప్రయాణీకులను దించేసి, నాలుగు బోగీలను అగ్నికి ఆహుతి చేసారు.

ఉద్యమకారులు రైల్వేస్టేషన్‌ నుంచి కొత్తపేటలోని సబ్ ట్రెజరీ కార్యాలయానికి వెడుతుండగా ప్రత్యేక పోలీసు బలగాలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులను చూసి ప్రజల ఆవేశం కట్టలు తెంచుకుంది. సమీపంలోని అడితి నుంచి కట్టెలు లాక్కొచ్చి పోలీసులపై దాడికి సిద్ధపడ్డారు. ప్రతిగా పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. ఆ కాల్పుల్లో ఏడుగురు ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయారు. ఆ పోరాటంలో పాల్గొన్న స్వాతంత్య్రయోధుడు కన్నెగంటి వెంకట్రావు, చేరువలోని పడమటి కాలువలో దూకి తప్పించుకోగలిగారు. తెనాలి గడ్డ మీద తెల్లవారికి జరిగిన శృంగభంగం అప్పటి బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్, అప్పటికి సింగపూర్‌లో ఉన్న నేతాజీ దృష్టికి సైతం వెళ్లింది. బెర్లిన్, టోక్యో రేడియోలు సైతం తెనాలి పోరాట వివరాలను, వీరుల ప్రాణ త్యాగాల వార్తలనూ ప్రసారం చేశాయి.

ఆ ఘటన తర్వాత తెనాలి పట్టణాన్ని పోలీసులు నెలల తరబడి తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. సాయుధ కవాతులతో ప్రజలను హడలగొట్టారు. స్వతంత్ర పోరాట యోధులను అరెస్టుచేసి, కఠిన శిక్షలు విధించారు. తెనాలి ప్రజలపై రూ.2 లక్షల సామూహిక జరిమానా విధించి, ప్రజలను తీవ్రంగా హింసించి మరీ వసూలు చేసారు.

అనతికాలంలోనే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. తెనాలిలో క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రజలు పోలీసులతో పోరాడిన ప్రదేశానికి రణరంగచౌక్ అని పేరుపెట్టారు. అమరవీరుల స్మృతిచిహ్నంగా 1959లో తెనాలి మున్సిపల్ చైర్మన్ ఆలపాటి వెంకట్రామయ్య అక్కడ ఏడు స్థూపాలను, తెలుగుతల్లి విగ్రహాన్నీ స్థాపించారు. ఆ ఏడాది డిసెంబరు 20న అప్పటి ఏఐసీసీ అధ్యక్షుడు కామరాజ నాడార్ వాటిని ఆవిష్కరించారు. అప్పటినుంచీ ప్రతీయేటా ఆగస్టు 12న తెనాలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ దినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు.