News

ఉగ్రవాది లతీఫ్ భట్ సమాచారం ఇస్తే 15 లక్షలు… జమ్మూలో పోస్టర్లు

8views

లష్కరే తోయబా సంస్థకు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది లతీఫ్ భట్ విషయంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. జూలై 22 న పోలీసు అధికారి హత్యకు కారణమైన లతీఫ్ సమాచారాన్ని అందించిన వారికి 15 లక్షల పారితోషికం ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్లను కూడా పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో అంటించి, ప్రచారం చేస్తున్నారు.

అనంత్‌నాగ్ పట్టణంలోని రద్దీగా ఉండే లాల్ చౌక్ ప్రాంతంలో జూలై 22న హెడ్ కాన్స్టేబుల్ ఆశిఖ్ హుస్సేన్ ఖురేషీ హత్యలో భట్ హస్తం ఉంది. వార్షిక శ్రీ అమర్‌నాథ్ యాత్ర భద్రత కోసం ఖురేషీ ఆ ప్రాంతంలో విధుల్లో ఉన్నారు.

పోలీసు అధికారిని చంపిన తర్వాత పారిపోతున్న సమయంలో లభించిన సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఉగ్రవాది ఫోటోను ఈ పోస్టర్లలో ప్రచురించారు. కుల్గామ్ జిల్లాకు చెందిన ఈ ఉగ్రవాది వయసు 22 సంవత్సరాలని పోస్టర్లలో పేర్కొన్నారు. సమాచారం అందించేందుకు వీలుగా పలు పోలీసు ఫోన్ నంబర్లను అందులో అందించారు.

ఖురేషీ వీరమరణం పొందిన కొన్ని రోజుల వ్యవధిలోనే, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత పరిపాలన ఆయన కుమారునికి ప్రభుత్వ ఉద్యోగ నియామకం కల్పించింది. ఆయన మరణానికి కారణమైన ఉగ్రవాదిని పట్టుకునేందుకు ₹15 లక్షల పారితోషికం ప్రకటించడం, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద మూలాలను అంతమొందించేందుకు పోలీసులు కొనసాగిస్తున్న చర్యల్లో భాగమే.

1989లో ఉగ్రవాద హింస ప్రారంభమైనప్పటి నుండి, ఉగ్రవాదంపై పోరాటంలో ఇప్పటివరకు 1,600 మందికి పైగా పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను అర్పించారు.

ఈ జాబితాలో రెగ్యులర్ అధికారులు, కానిస్టేబుళ్లు మరియు వందలాది మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (SPOలు) ఉన్నారు. అమరులైన వారిలో పలువురు ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ ఎస్పీలు, సూపరింటెండెంట్లు, డిఐజి స్థాయి అధికారులు కూడా ఉన్నారు.

అధికారిక రికార్డుల ప్రకారం, దేశసేవలో ఉగ్రవాదంతో పోరాడుతూ దాదాపు 515 మంది SPOలు ప్రాణాలు కోల్పోయారు.

ఖురేషీ హత్య జరిగిన తొమ్మిది రోజుల తర్వాత, జూలై 31న కుల్గామ్ జిల్లాలోని కేల్లామ్ గ్రామంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఇటుక బట్టీ కార్మికులను ఉగ్రవాదులు కాల్చిచంపారు. దీపక్, భూపిందర్‌లుగా గుర్తించిన ఈ కార్మికుల హంతకుల కోసం కూడా గాలింపు వేగవంతం చేశారు.

కాల్పుల రోజే దీపక్ అనంత్‌నాగ్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మరణించాడు. తీవ్రంగా గాయపడిన భూపిందర్‌ను శ్రీనగర్‌లోని షేర్-ఎ-కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SKIMS)కి తరలించారు. అయితే, వైద్యుల తీవ్ర ప్రయత్నాలు చేసినా.. ఆగస్టు 1న భూపిందర్ కన్నుమూశారు.