ArticlesNews

చుక్కల లోకానికి చిక్కటి దారి పరిచిన దార్శనికుడు

52views

( ఆగస్టు 12  –  డా. విక్రమ్ సారాభాయ్ జయంతి ) 

భారతదేశపు గడ్డ మీద నుంచి ఒక రాకెట్ అంతరిక్షం దిశగా ప్రయాణం చేసిన ప్రతీసారీ గుర్తుకొచ్చే పేరు డాక్టర్ విక్రమ్ సారాభాయ్. నక్షత్రవీధిలోకి మనను నడిపిన మహనీయుడిగా, అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచంలో అగ్రగామి దేశంగా భారత్‌ను తీర్చిదిద్దిన తొలితరం శాస్త్రవేత్తగా ఆయనను తలచుకుంటే గుండె ఉప్పొంగిపోతుంది. డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ 1919 ఆగస్టు 12న అహ్మదాబాద్‌లో జన్మించారు. ఆయన కుటుంబం వ్యాపారంలో ఉంటూ దానసేవాకార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు. కుటుంబ వాతావరణం ఆయనకు విశాల దృష్టిని సమకూర్చింది. ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా చూడాలన్న కలలకు వీలు కల్పించింది. ఆయన దార్శనికతే, ఒకప్పుడు పూర్తిగా విదేశీ సాంకేతికత మీద ఆధారపడిన భారతదేశాన్ని స్వతంత్ర అంతరిక్ష కార్యక్రమాలతో ప్రపంచంలోని గొప్ప వైజ్ఞానిక శక్తికేంద్రంగా తీర్చిదిద్దింది.

‘‘మానవుడి, సమాజపు నిజమైన సమస్యల పరిష్కారానికి అధునాతన సాంకేతికతలను ఉపయోగించడంలో మనం ఎవరికీ తీసిపోకూడదు’’ అని ఒకసారి విక్రమ్ సారాభాయ్ చెప్పారు. ఆయన చేసిన ఆ సంకల్పమే భారతదేశపు అంతరిక్ష విధానానికి తాత్విక మూలస్తంభంగా నిలబడింది.

గుజరాత్‌లోని ప్రఖ్యాత సారాభాయ్‌ కుటుంబంలో జన్మించిన విక్రమ్, బాల్యం నుంచీ మేధోపరమైన కుతూహలం ఉన్న వాతావరణంలో పెరిగారు. స్వరాష్ట్రంలో మౌలిక విద్యను అభ్యసించాక ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జిలో నేచురల్ సైన్సెస్‌లో డిగ్రీ పూర్తి చేసారు. రెండో ప్రపంచయుద్ధం మొదలైనప్పుడు తిరిగి స్వదేశానికి వచ్చేసారు. అప్పుడే ఆయన నోబెల్ గ్రహీత సి.వి రామన్ దగ్గర బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో చేరారు.

యుద్ధం ముగిసిన తర్వాత సారాభాయ్ మళ్ళీ కేంబ్రిడ్జికి వెళ్ళారు. అక్కడ 1947లో కాస్మిక్ రే ఫిజిక్స్‌లో పిహెచ్‌డి పూర్తి చేసారు. ఆయన పరిశోధన కేవలం విద్యాసంబంధమైనది మాత్రమే కాదు. అది అంతరిక్షం, వాతావరణాల గురించిన అధ్యయనాల మీద దృష్టి సారించింది. అనంతరకాలంలో అదే ఆయన జీవిత పథగామిగా నిలిచింది.

భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 1947లోనే విక్రమ్ సారాభాయ్ అహ్మదాబాద్‌లో ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (పిఆర్ఎల్) స్థాపించారు. కొద్దిమందితో ప్రారంభమైన పిఆర్ఎల్ అనతికాలంలోనే భారతదేశపు అంతరిక్ష పరిశోధనా కార్యక్రమాలకు కేంద్రస్థానంగా నిలిచింది. అంతరిక్ష సాంకేతికత కేవలం వైజ్ఞానిక కుతూహలంగా మిగిలిపోకూడదు, అది జాతీయ అభివృద్ధి లక్ష్యాలను సాధించేదిగా ఉండాలి అనే సారాభాయ్ ఆలోచనకు బీజం అక్కడే పడింది.

భారత అంతరిక్ష కార్యక్రమ నిర్మాత:

1960ల తొలినాళ్ళలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ), యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ (యుఎస్ఎస్ఆర్) మధ్య అంతరిక్ష రంగంలో పోటీని యావత్ ప్రపంచం చూస్తూ ఉండేది. ఆ సమయంలోనే, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశానికి అంతరిక్ష సాంకేతికత విలాసం ఎంతమాత్రం కాదనీ, అది కూడా అవసరమేననీ భారతదేశ నాయకత్వాన్ని విక్రమ్ సారాభాయ్ ఒప్పించగలిగారు. ఆయన పట్టుదల వల్లే 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్ (INCOSPAR) ఏర్పాటయింది. కాలక్రమంలో 1969లో ఆ సంస్థే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) గా పరిణామం చెందింది.

సారాభాయ్ నాయకత్వంలో….: 

• తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ (TERLS) నుంచి 1963లో భారతదేశపు మొదటి సౌండింగ్ రాకెట్‌ ప్రయోగం జరిగింది.
• కమ్యూనికేషన్, వాతావరణ అంచనాలు, విద్యా అవసరాల కోసం ఉపగ్రహ సాంకేతికతను వినియోగించడం మొదలైంది.
• ఆర్యభట్ట ఉపగ్రహం కోసం క్షేత్రస్థాయిలో పని ప్రారంభమైంది. సారాభాయ్ మరణించిన నాలుగేళ్ళకు, 1975లో ఆ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.

సారాభాయ్ దార్శనికత: 

డాక్టర్ విక్రమ్ సారాభాయ్ దార్శనికత ఇస్రోతోనే ఆగిపోలేదు. ఆయన భారతదేశంలో విభిన్న రంగాల్లో కీలకమైన సంస్థల స్థాపనలో ప్రధాన పాత్ర పోషించారు.

• ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ – అహ్మదాబాద్ (ఐఐఎం-ఎ) ద్వారా ప్రపంచస్థాయి మేనేజ్‌మెంట్ విద్యను భారతదేశానికి చేరువయింది.
• నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడి) దేశంలో పారిశ్రామిక, ఉత్పాదక డిజైనింగ్‌ను విప్లవాత్మకంగా మార్చేసింది.
• కమ్యూనిటీ సైన్స్ సెంటర్ (ఇప్పుడు విక్రమ్ ఎ సారాభాయ్ కమ్యూనిటీ సైన్స్ సెంటర్) శాస్త్ర సాంకేతిక రంగాల్లో యువతరానికి ప్రేరణగా నిలిచింది.

ఒక పారిశ్రామికవేత్తగా ఆయన సారాభాయ్ కెమికల్స్, స్వస్తిక్, సారాభాయ్ గ్లాస్ వంటి సంస్థలను విజయవంతంగా నడిపారు. ఆ విధంగా వైజ్ఞానిక రంగ పురోగతికీ, పారిశ్రామిక సామర్థ్యానికీ ముడివేసారు.

సేవలకు గుర్తింపు: 

దేశీయ శాస్త్ర సాంకేతిక రంగాలకు విక్రమ్ సారాభాయ్ అందించిన సేవలకు భారతదేశం ఆయనను సత్కరించుకుంది.
• 1962లో భౌతికశాస్త్రానికి గాను శాంతిస్వరూప్ భట్నాగర్ పురస్కారం
• 1966లో పద్మభూషణ్ పురస్కారం
• 1972లో (మరణానంతరం) పద్మవిభూషణ్ పురస్కారం…ఆయనను వరించి, తమ గౌరవాన్ని ఇనుమడింపజేసుకున్నాయి.

తిరువనంతపురంలో ఉన్న ఇస్రోకు చెందిన ప్రధానమైన రాకెట్ డెవలప్‌మెంట్ హబ్‌కు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) అని పేరుపెట్టి దేశం ఆయనను గౌరవించుకుంది.

ఒక్క మన దేశమే మాత్రమే కాదు, యావత్ ప్రపంచమూ విక్రమ్ సారాభాయ్ వైజ్ఞానిక సేవలను గుర్తించింది. చంద్రుడి మీద కనుగొన్న ఒక బిలం ‘‘బెసెల్ ఎ’’కు ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ ‘‘సారాభాయ్ క్రేటర్’’ అని నామకరణం చేసింది. దానితో ఆయన పేరు అజరామరంగా నిలిచిపోయింది.

వినువీధిలో భారత ప్రయాణానికి మార్గదర్శకుడు: 

1971 డిసెంబర్ 30న 52ఏళ్ళ వయసులో విక్రమ్ సారాభాయ్ అకస్మాత్తుగా మరణించారు. ఆయన మరణం వైజ్ఞానికులు, శాస్త్రవేత్తల ప్రపంచానికి భారీ నష్టం. అయినప్పటికీ భారతదేశపు ప్రతీ స్పేస్ మిషన్‌లోనూ ఆయన దార్శనికత సజీవంగా ఉంది. పిఎస్ఎల్‌వి, జిఎస్ఎల్‌వి రాకెట్ల ప్రయోగం ప్రారంభం నుంచి చంద్రయాన్-3 విజయం మీదుగా త్వరలో చేపట్టబోయే గగన్‌యాన్ హ్యూమన్ స్పేస్‌ఫ్లైట్ ప్రోగ్రామ్ వరకూ ప్రతీ ప్రయోగంలోనూ విక్రమ్ సారాభాయ్ ముద్ర ఉంది.

‘భారతదేశపు అభివృద్ధి అవసరాలను ఆధునిక సాంకేతికత తీర్చాలి’ అనే విక్రమ్ సారాభాయ్ తాత్వికతే ఇస్రోకు మార్గదర్శక సూత్రంగా నిలిచింది. దానిప్రభావంతో చేపట్టిన ప్రాజెక్టులే దేశంలోని అన్ని గ్రామాలకూ శాటిలైట్ టీవీని చేరువ చేసాయి, రైతుల కోసం వాతావరణాన్ని అంచనా వేస్తున్నాయి, డిజిటల్ బోధన ద్వారా పాఠశాలలను కనెక్ట్ చేస్తున్నాయి. అందుకే ఆయన కేవలం ఒక శాస్త్రవేత్త కాదు, జాతి నిర్మాత. క్షేత్రస్థాయిలో సమస్యలను తీర్చేందుకు మూలాలకు కట్టుబడి ఉంటూనే అంతరిక్ష పరిశోధనలతో నక్షత్రవీధుల్లో నడయాడే దేశంగా భారత్‌ను తీర్చిదిద్దిన మహనీయుడు విక్రమ్ సారాభాయ్. ధైర్యమూ, స్పష్టమైన దార్శనికతా కలిగిన కలలు అన్ని పరిమితులనూ అధిగమించగలవు అని ఆయన జీవితం నిరూపించింది.

విక్రమ్ సారాభాయ్ పరిశోధనలను కొనసాగిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నది ఒకటే… ‘‘మేము సారాభాయ్ కలలకు జీవం పోస్తున్నాం, వాటిని రోజురోజుకూ మరింత పెంచి పోషిస్తున్నాం.’’