News

ఆకివీడులో రామభక్తులపై దాడి

113views

శ్రీరామ నవమి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని పెదపేట ప్రాంతంలో ఉద్రిక్తత తలెత్తింది. నాయకులు, రామభక్తులపై మతం మారిన కొందరు క్రైస్తవులు దాడులు చేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కొన్ని రోజులుగా పెదపేటలో ఆలయ పునఃనిర్మాణంపై వివాదం నడుస్తోంది. ఈ నెల 8న ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఆ గుడిని సందర్శించి, రామాలయ పునరుద్ధరణకు ప్రకటన చేయగా, స్థానికులు వ్యతిరేకించారు. నాటి నుంచి అక్కడ పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. 17న ‘గొంతెనమ్మ ఆలయం’ పేరిట స్థానికులు ఫ్లెక్సీ కట్టారు. 19న రఘురామ మరోసారి అక్కడికి వచ్చి, నందీశ్వరునికి పూజలు చేయగా, వారు స్వాగతించి హారతులిచ్చారు. తాజాగా శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం ఉదయం 10.40కి రఘురామకృష్ణరాజు అక్కడికి చేరుకున్నారు.

అప్పటికే గుమిగూడిన స్థానిక యువకులు, మహిళలు రఘురామతో పాటు వెంటవచ్చిన వాహనశ్రేణిని అడ్డుకొని నిరసన తెలిపారు.

పోలీసుల భద్రత మధ్య ఆయన ఆలయంలోకి వెళ్లారు. గొంతెనమ్మ, నందీశ్వరుణ్ని మాత్రమే పూజించాలని, సీతారాములకు పూలమాలలు వేయొద్దని వారు డిమాండ్‌ చేశారు. చివరకు రఘురామకృష్ణరాజు.. సీతారాముల విగ్రహాలకు పూలమాలలు వేసి, తిరిగి వెళ్తుండగా పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రోప్‌ సాయంతో ఆయన్ను పంపించారు. వెంటవచ్చిన కూటమి నాయకులు, రామభక్తులపై కొందరు యువకులు మేకులు గుచ్చిన కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. వాహనాలను ధ్వంసం చేశారు. ఫొటోలు, వీడియోలు తీస్తున్న వారిపైనా దౌర్జన్యం చేశారని, సెల్‌ఫోన్లు లాగేసుకున్నారని బాధితులు వాపోయారు. పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.

దాడిని ఖండించిన సీఎం, డిప్యూటీ సీఎం
పెదపేట ఘటనను సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా ఖండించారు. ‘రామాలయ పునరుద్ధరణకు పూనుకున్న ఉపసభాపతి.. పూజలు చేసేందుకు వెళ్లినప్పుడు బయట వ్యక్తులతో కలిసి కొంతమంది ఆయుధాలతో దాడికి తెగబడడం గర్హనీయం. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఎవరు వ్యవహరించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం’’ అని వారు స్పష్టం చేశారు.