
( చైత్ర శుద్ధ దశమి – ధర్మరాజ దశమి )
చైత్ర శుద్ధ దశమి యముడికి సంబంధించిన పర్వదినం. ఈ ధర్మరాజ దశమి రోజున యమ ధర్మరాజును పూజిస్తే మరణభయం తొలగుతుందని చెబుతారు. ఆలయాల్లో యముడి పేరిట అర్చనలు జరిపిస్తారు.
కఠోపనిషత్తులోని కథనాన్ని అనుసరించి… నచికేతుడి తండ్రి అయిన వాజశ్రవుడు (అన్నదానాలతో కీర్తి పొందిన రుషి) విశ్వజిత్ యాగం చేయ సంకల్పించాడు. అతడు అప్పటికే మహాజ్ఞానిగా పేరు పొందడం వల్ల యాగం గురించి తెలుసుకున్న జనం తండోపతండాలుగా వచ్చారు. యాగం నిరాఘాటంగా ముగిసి, దాన కార్యక్రమం మొదలయ్యింది. వాజశ్రవుడు ఆరోగ్యంగా, దృఢంగా ఉన్న గోవులను తాను ఉంచుకుని, వట్టిపోయిన, జబ్బుచేసిన, బలహీనంగా ఉన్నవాటిని దానం చేస్తున్నాడు. తండ్రి తీరు చూసిన నచికేతుడికి బాధ కలిగింది. దానం ఏదైనా కావచ్చు.. అది తీసుకున్నవాళ్లకు ఉపయోగపడాలి కదా- అనుకున్నాడు. వెంటనే తండ్రి దగ్గరగా వెళ్లి ‘నీకు పనికిరానివాటినన్నింటినీ దానం చేస్తున్నావు.. మరి నన్నెవరికి దానం చేస్తావు?’ అనడిగాడు.
తండ్రికి కోపం వచ్చి- యముడికి దానం చేస్తానన్నాడు. ఆ మాట విని నచికేతుడు నిశ్చేష్టుడయ్యాడు. ఆవేశంలో అలా మాట్లాడినందుకు తండ్రి కూడా పశ్చాత్తాపం చెంది.. ‘కోపంలో అనేశాను.. అది నిజం కాదులే’ అన్నాడు తండ్రి. కానీ నచికేతుడు ఊరుకోలేదు. పవిత్రమైన యజ్ఞ సమయంలో, అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి అలాంటి మాట వచ్చిందంటే దానిని నెరవేర్చి తీరాలనుకున్నాడు. తండ్రి వారిస్తున్నా వినకుండా యమలోకానికి వెళ్లాడు. యముడు తన విధి నిర్వహణలో తలమునకలుగా ఉండి.. మూడు రోజుల తర్వాత నచికేతుణ్ణి గమనించాడు. తనను దానంగా తీసుకోమని ఎంతగా ప్రార్థించినా యముడు సమ్మతించలేదు. పైగా తన ద్వారం ముందర మూడు రోజులు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టి, మూడు వరాలను కోరుకోమన్నాడు.
‘యమధర్మరాజా! తమరు నన్ను దానంగా తీసుకోలేదు. అందుకు నా తండ్రి కోపగించకుండా, నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి. అదే నా తొలి కోరిక’ అన్నాడు నచికేతుడు. దానికి యముడు తథాస్తు అన్నాడు. తర్వాత స్వర్గం చేరడానికి యజ్ఞం చేయమని ఉపదేశించాడు. చివరిగా మరణజ్ఞానాన్ని వరంగా ఇవ్వమని అడిగాడు. యముడు దానికి బదులు మరేదైనా కోరుకోమని ఎంత చెప్పినా నచికేతుడు వినలేదు. చివరికి ఆత్మతత్వం గురించి వివరిస్తాడు యమధర్మరాజు. సంతృప్తి చెందిన నచికేతుడు సంతోషంగా తిరిగి వెళ్లాడు. ఆత్మజ్ఞానం గురించి యముడికీ, నచికేతునికీ జరిగిన సంభాషణే కఠోపనిషత్తులోని ముఖ్య భాగం. ధర్మరాజ దశమి రోజున ఈ కథ వినడం మంచిదని పెద్దలు చెబుతారు.





