Newsvideos

భావకవిత్వలోకాన కల్పవల్లి.. దేవులపల్లి కృష్ణశాస్త్రి

123views

(ఫిబ్రవరి 24 – దేవుల పల్లి కృష్ణశాస్త్రి వర్థంతి )

తెలుగు భావ కవితా రంగంలో ఆయన ఒక ముఖ్య అధ్యాయం. ఆయన కవిత్వంలో భావుకత్వం వెల్లివిరుస్తుంది.. ఆయన రాసే గీతాల్లో లాలిత్యం పాఠకులను తన్మయత్వంలో మునిగితేలేలా చేస్తుంది. తెలుగు సినిమా రంగాన ఆయన పాటలు జగద్విఖ్యాతం. ఆంధ్రా షెల్లీగా ప్రఖ్యాతి గాంచి ‘‘కృష్ణపక్షం’’ వంటి గొప్ప రచనను తెలుగు పాఠకులకు అందించిన ఆ మేటి సాహితీ దురంధరుడే ‘‘దేవుల పల్లి కృష్ణశాస్త్రి’’. రేడియాలో లలిత గీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని రామచంద్రపాలెం గ్రామంలో తమ్మన్నశాస్త్రి, సీతమ్మ దంపతులకు 1897 నవంబరు 1వ తేదీన జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా పిఠాపురం పాఠశాలలో సాగింది. పాఠశాల రోజుల్లోనే కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం వంటి రచయితల వద్ద ఆంగ్ల సాహిత్యాన్ని ఔపోసన పట్టాడు కృష్ణశాస్త్రి. 1918లో విజయనగరం వెళ్లి డిగ్రీ చేస్తున్న రోజుల్లోనే ఆయనకు కవిత్వం రాయడం పట్ల మమకారం ఏర్పడింది. డిగ్రీ పూర్తి చేసి పెద్దాపురంలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాక ఆయన పూర్తిస్థాయిలో రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టారు.

బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీసమితిలోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఎందరో కవులతోను, పండితులతోను పరిచయాలు కలిగాయి. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. బ్రహ్మ సమాజ లక్ష్యగీతం అనదగిన పాట ‘ఈ సుధర్మభవనములో ఈరేడు జగాలనేలు ఈశ్వరుడే దినజన హృదీశ్వరుడే కొలువుదీర్చు..’ అంటే దేవుడు గుళ్లో ఎక్కడో కూర్చోడు. జనం మధ్యలో తిరుగుతుంటాడు. ముఖ్యంగా దీనజనుల మధ్యలో ఉంటాడని ఈ గీతం ప్రబోధిస్తుంది. ఇలాగ, ఏకేశ్వర కీర్తనంతోనూ, ఈ జగత్తు అందరి కోసం, అందరిదీ, ఆనందమయమైనది అని చాటుతూ కృష్ణశాస్త్రి బ్రహ్మ సమాజ గీతాలు 67 ఉన్నాయి.

కృష్ణశాస్త్రిలో భక్తిభావమే కాదు సంఘసంస్కర్త కూడా ఉన్నాడు. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పర్చుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని వెలివేశారు. అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహిం చారు. 1922లో కృష్ణశాస్త్రి సతీమణి అర్థాంతరంగా మరణించడంతో కొన్నాళ్లు అదే బాధలో గడిపారు ఆయన. అదే బాధలో అనేక విషాద కవితలు రాశారు. ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, ప్రవాసము, ఊర్వశి వంటి ఖండకావ్యాలు అలా పుట్టినవే. 1929లో రవీంద్రనాథ్‌ ‌టాగుర్‌తో ఏర్పడిన పరిచయం కృష్ణశాస్త్రి జీవితాన్ని మరో మలుపు తిప్పింది. మరిన్ని కవితా రచనలను చేసేలా ప్రేరేపించింది.

లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం – కృష్ణశాస్త్రి పాటల్లోని ప్రధాన లక్షణాలు. చందమామలోని చల్లదనాన్ని, మందార పువ్వులోని మకరందాన్ని, గుండెలోని ఆర్ద్రతను రంగరించి రాస్తే అది కృష్ణశాస్త్రి పాటవుతుంది. పట్టు పరికిణిలో ఒదిగిన సింగారం కృష్ణశాస్త్రి పాట. ఆయన తెలుగు పదం అమ్మమ్మ చేతిలో నేతి నైవేద్యం. భావ కవిత్వానికి సినిమా పాటల ద్వారా ఒక శాశ్వత స్థానాన్ని ఏర్పాటు చేసి, దిశానిర్దేశం చేసిన అతి కొద్ది మంది కవులలో కృష్ణశాస్త్రి ముందుంటారు. తెలుగు సినిమాల్లో ‘జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’.. అని భరత మాతను కీర్తించినా, ‘జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి..’ అంటూ దేశభక్తిని చాటినా.. ఆకులో ఆకునై , పువ్వులో పువ్వునై అని మగువ ఆర్ద్రతకు పెద్దపీట వేసినా అది కృష్ణశాస్త్రికే చెల్లింది. భావ కవిగా, ‘ఆంధ్రా షెల్లీ’గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి… 1942లో బి.ఎన్‌.‌రెడ్డి ప్రోత్సాహంతో 1951లో వచ్చిన ‘మల్లీశ్వరి’తో చిత్రరంగంలో అడుగుపెట్టి, సినిమా పాటకు కావ్య గౌరవం అందించారు.

దేవులపల్లి కృష్ణశాస్త్రి 1957లో ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించారు. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ, 1978లో సాహిత్య అకాడమీ అవార్డు, 1976లో పద్మభూషణ్‌ ‌దేవులపల్లిని వరించాయి. 1964లో తిరుపతిలో అన్నమయ్య జయంతి ఉత్సవంలో కృష్ణశాస్త్రి పాల్గొన్నారు. ఆయన వెంట బాలాంత్రపు రజనీ కాంతరావు కూడా వెళ్ళారు. ఉపన్యాసం చదివేందుకు ఉద్యుక్తుడైన కృష్ణశాస్త్రి గొంతు బొంగురు పోయింది. దాంతో తన ఉపన్యాసాన్ని రజనీ కాంతరావు చేత చదివించారు. వైద్య పరీక్షల్లో అది గొంతు క్యాన్సర్‌ అని నిర్ధారణ అయింది. మద్రాసులో కృష్ణశాస్త్రి స్వరపేటికను తొలగించారు.

స్వరపేటిక తొలగించిన తరువాత కృష్ణశాస్త్రి దాదాపు పదహారేళ్లు బ్రతికినా, మూగవోయిన కంఠంతోనే అనేక సినిమాలకు పాటలు, ఆకాశవాణికి లలిత గీతాలు రాశారు. 1980 ఫిబ్రవరి 24న కృష్ణశాస్త్రి మరణించారు. తెలుగు దేశపు నిలువుటద్దం బద్దలైంది. షెల్లీ మళ్లీ మరణించాడు’ అంటూ కృష్ణశాస్త్రి చనిపోయిన రోజున శ్రీశ్రీ రోదించాడు. కవి సామ్రాట్‌ ‌విశ్వనాథ సత్యనారాయణ స్పందిస్తూ ‘ఒక్క షెల్లీ యే కాదు, కీట్స్, ‌వర్డ్స్‌వర్త్ ‌వంటి మహాశయుల సంయుక్త స్వరూపం కృష్ణశాస్త్రి’ అన్నారు. భౌతికంగా కృష్ణశాస్త్రి మన మధ్య లేకపోయినా తెలుగు హృదయ లోగిళ్లలో ప్రమోద గీతమై పల్లవిస్తూనే ఉంటాడు..ప్రభాత సూరీడై ప్రజ్వలిస్తూనే ఉంటాడు.