
సనాతన ధర్మ విలువలను ప్రపంచ దేశాలకు చేరవేయడంలో ఇస్కాన్ సంస్థ కీలకంగా పనిచేస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. క్షేత్ర స్థాయిలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ మానవ సేవే పరమావధిగా ముందుకు వెళుతోందని కొనియాడారు.
పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్న ఆయన.. నదియా జిల్లా మాయాపుర్‌లోని ఇస్కాన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకుర్ 152వ జయంత్యుత్సవాల్లో పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను ఇక్కడకు ప్రభుత్వ ప్రతినిధిగా రాలేదని.. చైతన్య మహాప్రభు భక్తునిగా వచ్చానని పేర్కొన్నారు. ‘‘దేశంలో పర్యటిస్తున్నప్పుడు ఇస్కాన్ ప్రభావాన్ని గమనించాను. మీరు ప్రచురించిన భగవద్గీత అన్ని వయసుల వారికి, అన్ని వర్గాల వారికీ అక్కరకు వస్తోంది. అయితే భక్తి దగ్గరే ఇస్కాన్ ఆగిపోలేదు. ఎక్కడైనా విపత్తు తలెత్తితే అక్కడకు వెళ్లి చేయందించే మొట్టమొదటి సంస్థగా నిలుస్తోంది. ఆహార పంపిణీ శిబిరాలు ఏర్పాటు, విద్య, వైద్య రంగాలను పేదవారికి చేరువ చేయడానికి అనేక కార్యక్రమాలను చేపడుతోంది’ అని అమిత్ షా కొనియాడారు.





