News

కర్ణాటకలో ఉగ్రవాది అరెస్ట్‌ పాక్‌ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు

5views

కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లాలోని హరిహర తాలూకా పట్టణంలో అనుమానిత ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన సొహైల్‌(20) ఉపాధి కోసం హరిహరకు వచ్చి పెయింటింగ్‌ పని చేస్తున్నాడు. ఇతడు ఇన్‌స్టా్రగామ్‌ ద్వారా పాకిస్తాన్‌ ఉగ్రవాదులతో నిరంతరం సంప్రదింపులు సాగిస్తున్నాడని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ), కేంద్ర ఇంటెలిజన్స్‌ విభాగాలు గుర్తించాయి.

దావణగెరె పోలీసులకు సమాచారం చేరవేశాయి. దాంతో డీఎస్పీ బసవరాజ్‌ నేతృత్వంలో పోలీసులు మంగళవారం సొహైల్‌ నివాసంపై దాడి చేసి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. నెలరోజుల క్రితం తుమకూరు నగరంలో జమీర్‌ఖాన్, అల్లాబక్ష్  అనే ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిద్దరితో సొహైల్‌కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సొహైల్‌ అద్దె ఇంటిలో ఉండగా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

అతడి మొబైల్‌ఫోన్‌ని పరిశీలించగా పాకిస్తాన్‌ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నామని వెల్లడించారు. 15 రోజుల క్రితమే ఇతరులతో కలిసి ఒక బృందంగా ఇక్కడికి చేరుకున్నాడని, మిగతా వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని తెలియజేశారు. అయోధ్యలోని భవ్య రామమందిరంలో బాంబులు పెట్టి పేల్చడానికి కుట్ర పన్నినట్లు పోలీసుల ఎదుట సొహైల్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. అతడి మొబైల్‌ ఫోన్‌లో పాకిస్తాన్‌ కోడ్‌ కలిగిన గ్రూపులు, ఆయుధాల చిత్రాలు లభ్యమయ్యాయి. అనేక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల సభ్యులతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. పాకిస్తానీ వ్యక్తి ఫోన్‌ నంబర్‌ను రాణా బాయ్‌ అనే పేరుతో తన ఫోన్‌లో సేవ్‌ చేసుకున్నాడు. దేశద్రోహ కార్యకలాపాల్లో సోహైల్‌ చురుగ్గా పాల్గొంటున్నట్లు గుర్తించారు. పలు ఉగ్రవాద సంస్థల వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ గ్రూపుల్లోనూ ఇతడు సభ్యుడిగా కొనసాగుతున్నాడు.