
కృష్ణాజిల్లా దివిసీమ ప్రాంతంలోని ఘంటసాల తాడేపల్లి గ్రామంలో ఉన్న మలయాళస్వామి ఆశ్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రుతి భారతి వేద పాఠశాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, భారతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గుళ్లపల్లి శ్రీరామకృష్ణ, ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామీజీ సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ, వేదాలు భారతీయ సంస్కృతి, సనాతన ధర్మానికి పునాది వంటివని పేర్కొన్నారు. వేద విద్య పరిరక్షణ, ప్రచారం సమాజానికి అత్యంత అవసరమని, యువతలో భారతీయ ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేందుకు వేద పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
దివి ప్రాంతంలో తాడేపల్లిలో వేద పాఠశాల ఏర్పాటు కోసం విశేష కృషి చేసిన ఎన్ఆర్ఐ దాతలు మూల్పూరి వెంకటరావు–సావిత్రి దంపతులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రముఖులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
వేద విద్యాభివృద్ధికి, సనాతన ధర్మ పరిరక్షణకు ఇలాంటి వేద పాఠశాలలు మరిన్ని ఏర్పడాలని పలువురు ఆకాంక్ష వ్యక్తం చేశారు.





