News

కనిష్కను కూల్చింది ఖలిస్థానీ ఉగ్రవాదులే : 41 ఏళ్ల తర్వాత అంగీకరించిన కెనడా

30views

ఖలిస్థానీ ఉగ్రవాదంపై మెతక వైఖరి అవలంబిస్తూ.. వారికి పరోక్షంగా మద్దతిస్తూ, ఆశ్రయమిస్తూ వచ్చిన కెనడా తన వైఖరిని మార్చుకుంటోందా..? అవుననే సమాధానం వస్తోంది. ఎయిరిండియా కనిష్క విమాన ప్రమాదం జరిగి నాలుగు దశాబ్దాల గడిచిన తర్వాత తొలిసారి.. 329 మంది ప్రాణాలను బలిగొన్న ఆ ఘటనలో ఖలిస్థానీ ఉగ్రవాదుల పాత్ర ఉందని అధికారికంగా అంగీకరించింది. ఇన్నాళ్లు ఖలిస్థానీ వేర్పాటు వాదుల పేరును ఎన్నడూ ప్రస్తావించని ఆ దేశం.. ఇప్పుడు ఆ దారుణ మారణ కాండకు వారే కారణమని స్పష్టం చేసింది. 1985 జూన్ 23న అట్లాంటిక్ మహా సము ద్రంపై ఎయిరిండియా బోయింగ్ విమానం ‘కనిష్క’ కూలి అందులో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. టొరంటో నుంచి ముంబయికు బయల్దేరిన ఆ విమానంలో ఉగ్రవాదులు బాంబు పెట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే ఇది ఖలిస్థానీ ఉగ్రవాదుల పనేనని భారత్ స్పష్టంగా పేర్కొంది. కానీ కెనడా ఎన్నడూ వారి పాత్రను అంగీకరించడానికి ఇష్టపడలేదు. విచారణ తూతూ మంత్రంగా జరిపింది. దీంతో కీలక నిందితులు తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్ఐఎస్) బుధవారం ఫేస్ బుక్ పోస్ట్ లో దాడికి ఖలిస్థానీ వేర్పాటువాద ఉద్యమమే కారణమని స్పష్టం చేసింది. కెనడా స్థావరంగా పనిచేస్తున్న ఖలీస్థానీ తీవ్రవాదులే.. బాంబు పెట్టి విమానంలో ఉన్న వారినందరినీ హతమార్చారని తెలిపింది. కెనడా చరిత్రలోనే అత్యంత దారుణమైన ఉగ్రదాడి అని పేర్కొంది. విమా నంలోని లగేజీ విభాగంలో ఖలీస్థానీ గ్రూప్ బబ్బర్ ఖాల్సా సభ్యులు నాడు బాంబులు పెట్టి విమానాన్ని కూల్చేశారు.