News

మైనారిటీలే టార్గెట్ గా ‘దైవ దూషణ’ పేరుతో పాక్‌లో వ్యవస్థీకృత మాఫియా

7views

పాకిస్థాన్‌లో అత్యంత కఠినమైన ‘దైవ దూషణ’చట్టాలను ఆసరాగా చేసుకుని ఒక ప్రమాదకరమైన, వ్యవస్థీకృత క్రైమ్ నెట్‌వర్క్ చాపకింద నీరులా విస్తరిస్తోందని ‘జెనిత్’, ‘వాయిస్ ఆఫ్ పాకిస్థాన్ మైనారిటీ’ (వీవోపీఎం) నివేదికలు వెల్లడించాయి. సోషల్ మీడియా వేదికగా అమాయకులను, ముఖ్యంగా క్రైస్తవులు, హిందువులు వంటి మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ఈ నెట్‌వర్క్ వల విసురుతోంది. వారితో ఎలాగైనా దైవాన్ని నిందించేలా ఉసిగొల్పి, ఆ తర్వాత కేసుల పేరుతో బ్లాక్‌మెయిల్ చేసి భారీగా డబ్బులు వసూలు చేయడమే (బ్లాస్పెమీ బిజినెస్) ఈ గ్యాంగ్ ప్రధాన ఉద్దేశం.

ఈ దందా సాగే తీరును వివరిస్తూ.. సైమన్ అనే పాకిస్థానీ క్రైస్తవ సామాజిక కార్యకర్త కీలక విషయాలు పంచుకున్నారు. సోషల్ మీడియాలో మైనారిటీల అకౌంట్లపై ఈ గ్యాంగ్ నిరంతరం నిఘా ఉంచుతుంది. ఆన్‌లైన్‌లో పరిచయం పెంచుకుని, వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ మొదట నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాత సంభాషణను నెమ్మదిగా మతపరమైన అంశాల వైపు మళ్లిస్తారు. ఆ సమయంలో టార్గెట్ చేసిన వ్యక్తి పొరపాటున మతాన్ని విమర్శిస్తూ లేదా ప్రశ్నిస్తూ ఒక్క మాట మాట్లాడినా.. వెంటనే ఆ చాటింగ్ స్క్రీన్‌షాట్లను తీసి ‘తిరుగులేని సాక్ష్యం’గా మారుస్తారు.

ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఈ నెట్‌వర్క్‌తో చేతులు కలిపిన పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) అధికారుల సాయంతో బాధితుడిని బెదిరించి పెద్ద మొత్తంలో లంచాలు వసూలు చేస్తారు. ఒకవేళ బాధితుడు లొంగకపోతే, ఆ స్క్రీన్‌షాట్లను అతడి కుటుంబ సభ్యులకు, పనిచేసే ఆఫీసులకు, స్థానిక మత పెద్దలకు లీక్ చేస్తారు. పాకిస్థాన్‌లో మత నింద ఆరోపణలు వస్తే మూకదాడులు జరుగుతాయనే భయంతో బాధితులు వారు అడిగినంత ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఈ దాడుల వల్ల ఇప్పటికే వందలాది మైనారిటీల కుటుంబాలు ఇళ్లు వదిలి పారిపోగా, డజన్ల కొద్దీ ఇళ్లు ధ్వంసమయ్యాయి.

రావల్పిండి, ఇస్లామాబాద్ నగరాల్లో ప్రారంభమైన ఈ ‘బ్లాస్ఫెమీ బిజినెస్’ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ నెట్‌వర్క్‌కు ప్రముఖ ఇస్లామిక్ పండితులు, ప్రభుత్వ అధికారుల అండదండలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. కోర్టుల్లో విచారణలు జరిగేటప్పుడు నిందితులకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలంటూ మత సమూహాలు కోర్టులను ముట్టడిస్తున్నాయి. అయితే, ఈ ఆందోళనల్లో పాల్గొనే చాలామంది ఆధ్యాత్మికంగా కంటే డబ్బు కోసమే వస్తున్నారని, నిర్వాహకులు డబ్బులు ఇవ్వనప్పుడు జరిగిన గొడవలే ఇందుకు నిదర్శనమని నివేదిక వెల్లడించింది.

పాకిస్తాన్ చట్టాల ప్రకారం మత నిందనకు మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధిస్తారు. అయితే ఇవి ఎటువంటి పక్కా ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలతోనే అరెస్టు చేసేలా అస్పష్టంగా ఉన్నాయని మానవ హక్కుల సంఘం (HRCP) ఆవేదన వ్యక్తం చేసింది. కోర్టుల వెలుపల ఉండే మతోన్మాద గుంపుల భయంతో న్యాయమూర్తులు బెయిల్ ఇవ్వడానికి భయపడుతున్నారని, నిందితుల తరపున వాదించే న్యాయవాదులపై కూడా ప్రాణాంతక దాడులు జరుగుతున్నాయని (గతంలో లాయర్ రషీద్ రెహమాన్ హత్య వంటి ఘటనలు) హక్కుల సంఘాలు గుర్తుచేశాయి. ఈ అరాచక నెట్‌వర్క్ పాకిస్తాన్ న్యాయవ్యవస్థను, రాష్ట్ర యంత్రాంగాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.