
ఝార్ఖండ్‌లోని పడిహౌస్ గ్రామంలో గిరిజన వాసుల ప్రాచీన విలువిద్య పోటీలు ఘనంగా జరిగాయి. నాటి బ్రిటీష్ పాలకులతో పోరాడిన తమ పూర్వీకుల్ని స్మరిస్తూ ఈ పోటీలు నిర్వహిస్తారు. వేలాదిమంది ఆదివాసీలు దీనిలో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమాన్ని తమ పూర్వీకుడైన స్వాతంత్ర్య సమరయోధుడు బాబా తిలక్ మాంఝీ వర్ధంతి సందర్భంగా జరుపుకున్నారు. విలువిద్య భారతీయ సంప్రదాయ కళల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. నాటి బ్రిటీష్ పాలకులపై పోరాడటంలో ముఖ్య పాత్ర పోషించింది. గిరిజన తెగకు చెందిన బిర్సాముండా, చాండ్ భైరవ్, సిద్‌కాన్హూ, తిలక్‌మాంఝీ ఈ విల్లునే చేత పట్టి ఆంగ్లేయులపై పోరాడారు. వారినీ వారి ధైర్య సాహసాలను స్మరిస్తూ ఆదివాసీలు ఈ విలు విద్య పోటీలను జరుపుకొంటారు. ఈ పోటీల కోసం చుట్టు పక్క రాష్ట్రాల నుంచి వేలాది మంది ఆదివాసీలు తరలివచ్చారు. వందలాది మంది పురుషులు, మహిళలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తారు. ఆదివాసీల సంస్కృతి, వారసత్వాన్ని ఈ విలువిద్య పోటీలు ఉట్టిపడేలా చేస్తాయి. ఆనాటి పోరాట యోధుల ధైర్య సాహసాల గురించి భావి తరాలకు తెలియజేయాలనే లక్ష్యంతో ఏటా ఈ విలువిద్య పోటీలు జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.





