News

పడవ మునిగి రోహింగ్యాలు మృతి

810views

బంగ్లాదేశ్‌ నుంచి మలేషియాకు రోహింగ్యా శరణార్థులను తీసుకెళ్తున్న పడవ మంగళవారం బంగాళాఖాతంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. దీని గురించి సమాచారం అందుకున్న బంగ్లాదేశ్‌ కోస్ట్‌గార్డు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని 73 మందిని కాపాడారు. ఆచుకీ తెలియని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బంగ్లాదేశ్‌ కోస్ట్‌ గార్డ్‌ అధికార ప్రతినిధి హమీదుల్ ఇస్లాం కథనం ప్రకారం… బంగ్లాదేశ్‌లోని కాక్స్‌ బజార్ నుంచి మలేషియాకు 130 మంది రోహింగ్యా శరణార్థులతో పడవ బయలుదేరింది. కేవలం 50 మందికి సరిపోయే పడవలో 130 మందిని ఎక్కించుకోన్నారు. దీంతో బరువు మోయలేక అది మధ్యలోనే మునిగిపోయినట్లు హమీదుల్ తెలిపారు. ఆ పడవలో మహిళలు, చిన్నారులు అధికసంఖ్యలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ‘సేవ్ ది చిల్డ్రన్‌’ అంతర్జాతీయ సంస్థ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. రోహింగ్యాల తిరిగి తమ దేశానికి వచ్చేలా మయన్మార్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది.

2017లో మయన్మార్‌లో రోహింగ్యాలపై అక్కడి సైన్యం దాడులు జరిపింది. ఆ దాడిలో వేల సంఖ్యలో రోహింగ్యాలు మృతి చెందగా సుమారు ఏడు లక్షల మందికిపైగా బంగ్లాదేశ్‌కు వలసపోయారు. వీరిలో కొంతమంది సముద్ర మార్గంలో మలేషియాకు చేరుకొని అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటికే లక్ష మందికి పైగా రోహింగ్యాలకు తమ దేశంలో ఆశ్రయం కల్పించినట్లు మలేషియా వెల్లడించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.