
భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశాలకు జోక్యం చేసుకునే హక్కు ఎంతమాత్రం లేదని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. ఐరోపా సమాఖ్య (ఈయూ) పార్లమెంట్‌లో ఇటీవల భారత్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని తీసుకొచ్చి చర్చించిన విషయాన్ని శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ రాజ్యసభలో ప్రస్తావించారు. దీనిపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు స్పందిస్తూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నేను స్పష్టంగా ఒకటే చెబుతున్నా. భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు విదేశాలకు లేదు. ఇది నేను రాజ్యసభ ఛైర్మన్ హోదాలోనే కాదు దేశ ఉపరాష్ట్రపతిగా కూడా చెబుతున్నా. ఇక్కడి విషయాలేవైనా భారత పార్లమెంటులో చర్చించి నిర్ణయం తీసుకునే అధికారం ఉంది’ అని ఆయన స్పష్టం చేశారు. విదేశాలు తమ దేశాల్లో జరుగుతున్న విషయాల గురించి పట్టించుకుంటే బాగుంటుందని హెచ్చరించారు. భారత పార్లమెంటులో బ్రెగ్జిట్ గురించి చర్చిస్తే వాళ్లు ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలోనూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భారత్ అంతర్గత వ్యవహారాల్లో బయటి వ్యక్తుల జోక్యం తగదని హెచ్చరించారు.





