News

‘స్మార్ట్‌ కళ్లజోడుతో’ పద్మనాభుడి ఆలయంలోకి.. సింగపూర్‌ టూరిస్ట్‌పై కేసు!

123views

కేరళలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలోని వెళ్లిన ఓ పర్యటకుడు.. కెమెరా అమర్చిన కళ్లద్దాలతో రికార్డు చేసేందుకు ప్రయత్నించాడు. దీన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సింగపూర్‌లోని నార్త్‌షోర్‌ డ్రైవ్‌ నివాసి తిరునీపనార్‌ (49)గా గుర్తించారు. అయితే, అతడు శ్రీలంక సంతతి వ్యక్తిగా భావిస్తున్నారు.

కెమెరా అమర్చిన స్మార్ట్‌ కళ్లజోడు ధరించిన తిరునీపనార్‌.. శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించి లోపల వీడియో చిత్రీకరించడం మొదలుపెట్టాడు. ఆలయ ఉత్తరం వైపు, తులాభారం మండపంతోపాటు ఇతర ప్రదేశాలను చిత్రీకరించాడు. దీన్ని గుర్తించిన ఆలయ భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. అనంతరం ఫోర్ట్‌ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడికి నోటీసులు అందించిన పోలీసులు డిసెంబర్ 21న విచారణకు రావాలని సూచించారు.