ArticlesNews

ఆచార్యవాన్‌ పురుషోవేదః

6views

భారతీయ సంస్కృతిలో గురుశిష్యుల సంబంధం చాలా పవిత్రమైనది. అమ్మానాన్నల తర్వాత ఆచార్యులకే పెద్ద పీటవేశారు. గురు అనే పదానికి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడని అర్థం. వేదాల నుంచి ఉపనిషత్తుల వరకు, ఇతిహాసాల నుంచి భక్తి సాహిత్యం వరకు, ప్రతి చోటా గురుత్వానికి ఉన్నత స్థానం ఉంది.

ఆచార్యవాన్‌ పురుషోవేదః అని ఛాందోగ్యోపనిషత్‌ చెబుతుంది. అంటే గురువును ఆశ్రయించినవాడే నిజమైన జ్ఞానాన్ని పొందగలడని అర్థం. గురు తత్వాన్ని ఉన్నతంగా ఆధ్యాత్మికంగా ప్రతిపాదించిన గ్రంథాలలో ‘గురుగీత’ విశిష్ట స్థానం పొందింది. గురువును ఎందుకు ఆశ్రయించాలి, అసలు జ్ఞానమంటే ఏంటి, మోక్షానికి మార్గం ఎప్పుడు ప్రారంభమవుతుంది? అనే ప్రశ్నలకు ‘గురుగీత’ సమాధానమిస్తుంది. పురాణాల ప్రకారం పార్వతీదేవి అడిగిన ప్రశ్నలకు పరమశివుడు ఇచ్చిన ఉపదేశమే ఈ ‘గురుగీత’. ఇందులో శివుడు గురువును బ్రహ్మస్వరూపుడిగా పరబ్రహ్మతత్వానికి ప్రతీకగా వివరిస్తాడు. భక్తి అనేది అంధానుకరణ కాదని జ్ఞానాన్వేషణకు దారితీసే అంతర్ముఖ వినయమని ‘గురుగీత’ చెబుతుంది.

మనిషి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని స్వయంకృషితో ఆరంభించినప్పటికీ అది పరిపూర్ణమవ్వడానికి గురువు మార్గదర్శకత్వం తప్పనిసరి. అరిషడ్వర్గాల వంటి బంధనాల మాయావరణాన్ని ఛేదించి ఆత్మతత్వాన్ని దర్శింపజేసేది గురువేనని ‘గురుగీత’ బోధిస్తుంది. అందువల్ల గురువు కేవలం బోధకుడు మాత్రమే కాదు, శిష్యుడిలో నిద్రాణంగా ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పే జ్ఞానదీపం. భగవంతుడి గురించి ఎన్నో పురాణేతిహాసాలు చెబుతాయి. కానీ దైవత్వాన్ని అనుభవంగా మార్చి చూపించేది గురువు మాత్రమే అంటుంది ‘గురుగీత’.

భగవద్గీత కృష్ణార్జున అనుబంధాన్ని గురుశిష్యుల సంబంధంగా అభివర్ణిస్తుంది. యుద్ధభూమిలో ఉన్న అర్జునుడికి కృష్ణుడు కర్తవ్యబోధ చేశాడు. జీవిత సత్యాన్ని దర్శింపచేశాడు. సందేహం నుంచి స్థితప్రజ్ఞత వైపు తీసుకెళ్లిన ఆ మార్గదర్శకత్వమే నిజమైన గురుత్వం. గురుశిష్యుల సంప్రదాయం గురించి ప్రస్తావనలు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు… ఇంకా అనేక ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తాయి. జంతువులు, పక్షులు మనుషులు… సమస్త ప్రకృతి నుంచి జ్ఞానాన్ని గ్రహించవచ్చునని దత్తాత్రేయుడి చరిత్ర చెబుతుంది. గురుకుల వ్యవస్థ, ఆచార్యుడి ప్రాధాన్యం, ధర్మబోధనలో గురువు పాత్ర మొదలైన విషయాలను విష్ణుపురాణం తెలియజేస్తుంది.

గురుశిష్యుల సంప్రదాయం ఎన్నో అత్యుత్తమ వ్యక్తిత్వాలను నిర్మించింది. శ్రీరాముడు వశిష్ఠుడి దగ్గర ధర్మతత్వాన్ని, అర్జునుడు ద్రోణాచార్యుల దగ్గర ఏకాగ్రతతో కూడిన విలువిద్యను నేర్చుకున్నారు. రామకృష్ణ పరమహంసతో సాన్నిహిత్యం స్వామి వివేకానందను ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయించింది.

అద్వైత వేదాంతాన్ని పునరుద్ధరించి భారతదేశమంతటా జ్ఞాన ప్రచారం చేసి, గురు పరంపరను బలోపేతం చేశారు ఆదిశంకరాచార్యులు. ఈ సంప్రదాయం భారతీయ సంస్కృతిలో గురువు స్థానాన్ని భగవంతుడికన్నా ముందు నిలబెట్టింది. ఎందుకంటే, భగవంతుడి వైపు చూపించే చేయి గురువుది కాబట్టి. మన ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ గురువును పరబ్రహ్మ స్వరూపంగా కీర్తిస్తూ, ఆయనను ఆశ్రయించినవారే ఆధ్యాత్మిక యాత్రలో గమ్యాన్ని సులభంగా చేరగలరని ప్రతిపాదిస్తాయి.