
ఐక్యరాజ్యసమితి: తీవ్రమైన ఆర్థిక, రాజకీయ, సైనిక సంక్షోభాల్లో చిక్కుకున్న ప్రస్తుత ప్రపంచంలో సంక్లిష్టతల్ని అధిగమించడానికి ఉపయోగపడే మౌలిక నైపుణ్యంగా ధ్యానం గుర్తింపు పొందుతోందని, ప్రపంచ శాంతి సామరస్యాల సాధనకు ధ్యానం మార్గం చూపుతోందని ఆధ్యాత్మికవేత్తలు, ఐరాస రాయబారులు అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్య సమితిలో భారత్, అండోరా, మెక్సికో, నేపాల్, శ్రీలంక దేశాల శాశ్వత మిషన్‌లు ఐరాస ప్రధాన కార్యాలయంలో రెండో ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమం నిర్వహించాయి. ప్రపంచ శాంతి సామరస్యాల కోసం ధ్యానం అనే శీర్షికతో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ ప్రసంగించారు. ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేసే 700 శాస్త్రీయ పరిశోధక పత్రాలు ఉన్నాయని, ధ్యానం వల్ల 100కు పైగా ప్రయోజనాలు కలుగుతాయని శ్రీ శ్రీ రవిశంకర్ అన్నారు. మనిషిని అతని అంతరంగంలో దాగి ఉన్న సమైక్యతా భావనతో ధ్యానం ఏకం చేస్తుందన్నారు. ధ్యానం కీలక దౌత్య సాధనంగా కూడా మారిందని, మరింత స్పష్టత దిశగా మనల్ని నడిపిస్తోందని, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీశ్ అన్నారు. గత సంవత్సరం ఐరాస డిసెంబరు 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటిస్తూ తీర్మానం చేసిందని ఈ తీర్మానం వెనక భారత్ కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఐరాసలో నేపాల్ శాశ్వత ప్రతినిధి లోక్ బహాదుర్ థాపా తదితరులు ఈ సందర్భంగా ప్రసంగించారు.





