
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని రణమండల కొండపై ఉన్న పురాతన శివాలయంలో పవిత్రమైన ఆలయ దీపం నుంచి ఓ యువకుడు సిగరెట్ వెలిగించిన ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించి, వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించింది. పోలీసులు కేసు నమోదు చేసి, వీడియోలో కనిపించిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే, ఈ వీడియో ఇటీవల వైరల్ కావడానికి గల కారణాలు, దీని వెనుక ఉన్న వ్యక్తులు లేదా కుట్ర కోణాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
పోలీసుల వివరాల ప్రకారం, యువకుడిని ఆదోని మండలం విరూపాపురం గ్రామానికి చెందిన వడ్డే ఎరన్నగా గుర్తించారు. ఆలయంలో వెలిగిస్తున్న పవిత్ర దీపం నుంచి సిగరెట్ వెలిగించి, ఆ దృశ్యాన్ని వీడియోగా చిత్రీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గౌలిపేటకు చెందిన బోయ శివరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 299 కింద కేసు నమోదు చేశారు.
ప్రాథమిక విచారణలో, ఈ వీడియో 2022లో తాను 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల సమయంలో ముగ్గురు స్నేహితులతో కలిసి ఆలయాన్ని సందర్శించినప్పుడు చిత్రీకరించినదేనని ఎరన్న తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో, ఇంతకాలం తర్వాత ఈ పాత వీడియోను ఇటీవల ఎవరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు? దాని వెనుక ఉద్దేశ్యం ఏమిటి? అనే అంశాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ఉద్దేశంతో ఈ వీడియోను కావాలనే వైరల్ చేశారా? శాంతిభద్రతలకు భంగం కలిగించే కుట్ర ఏదైనా ఉందా? అనే కోణంలో కూడా ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు.
అదే సమయంలో, యూట్యూబర్ జోసెఫ్ (అలియాస్ రావణ్)కు సంబంధించిన వివాదంతో ఈ వీడియో వైరల్ కావడానికి ఏమైనా సంబంధం ఉందా అనే అంశాన్ని కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఖాతాలు, డిజిటల్ ఆధారాలు, ఆన్‌లైన్ కార్యకలాపాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. మతపరమైన విద్వేషాన్ని రెచ్చగొట్టేలా లేదా సామాజిక శాంతికి భంగం కలిగించేలా సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.





