
ఒక పాఠశాలలో జరిగిన లైవ్ కాన్సర్ట్‌లో ‘సెక్యులర్’ పాట పాడాలంటూ ఓ వ్యక్తి తనను వేధించినట్లు బెంగాలీ సింగర్ లగ్నజిత్ చక్రవర్తి ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. శనివారం తూర్పు మిడ్నాపుర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ లైవ్ షోలో ఈ ఘటన జరిగిందని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమంలో భక్తి పాట పాడుతుండగా.. మెహబూబ్ మాలిక్ అనే వ్యక్తి వేదికపైకి వచ్చి అడ్డుతగిలినట్లు తెలిపారు. తనను దుర్భాషలాడుతూ.. దాడి చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. భక్తి పాటలు కాకుండా.. ‘సెక్యులర్’ పాటలు పాడాలని తనపై ఒత్తిడి చేసినట్లు వాపోయారు. మాలిక్ ఆ పాఠశాల నిర్వహణా కమిటీ సభ్యుడేనని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు తీసుకునేందుకు భగవాన్‌పుర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ నిరాకరించినట్లు ఆరోపించారు. ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు.. మాలిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. తొలుత ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించిన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ ఘటనను బిజేపీ తీవ్రంగా ఖండించింది. గాయనిపై దాడికి ప్రయత్నించిన మాలిక్ అధికార టీఎంసీ సభ్యుడని బిజెపి నేత షాకుదేబ్ పాండా ఆరోపించారు. గాయని ఏ పాట పాడాలో కూడా వారే నిర్దేశించడాన్ని తప్పుబట్టారు. దాడికి యత్నించారంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదంటూ మండిపడ్డారు





