
ఎర్రకోట పేలుడు ఘటనతో జైషే మహిళా విభాగం కుట్రలు తెర పైకి వచ్చాయి. ఈ పేలుడు కుట్రలో కీలక భాగస్వామి అయిన డా. షాహిన్ షాహిద్ జైషే మహమ్మద్ మహిళా విభాగం ‘జమాత్ ఉల్ మొమినాత్’ సభ్యురాలని దర్యాప్తు వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్రిగేడ్‌కు సంబంధించి మరిన్ని కీలక విషయాలు బయటికొచ్చాయి. ఇప్పటివరకు ఈ విభాగంలో 5000 మందికి పైగా చేరినట్లు తెలిసింది. దీనిపై జైషే చీఫ్ మసూద్ అజార్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
అక్టోబరు 8 నుంచి జైషే ప్రధాన కార్యాలయంలో ఈ బ్రిగేడ్ కోసం నియామకాలు ప్రారంభించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇందులోభాగంగా పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్, ముల్తాన్, సియాల్‌కోట్, కరాచీ, కొట్లీ, ముజఫరాబాద్ ప్రాంతాల నుంచి మహిళలను నియమించుకున్నట్లు తెలిపాయి. వీరికి ప్రతిరోజూ 40 నిమిషాల పాటు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నారట. ఐసిస్, హమాస్, ఎల్‌టీటీఈ తరహాలో మహిళలతో ఆత్మాహుతి దాడులకు సిద్ధమయ్యేలా వీరిని ప్రేరేపిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం ఒక్కో మహిళ నుంచి రూ.500 చొప్పున విరాళాల కింద సేకరిస్తున్నట్లు సమాచారం.
జైషేలో పురుష ఉగ్రవాదుల తరహాలోనే వీరికి కూడా కఠిన శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ బ్రిగేడ్‌లో చేరేవారికి రూల్స్ కూడా కఠినంగా ఉన్నాయట. భర్త లేదా కుటుంబసభ్యుడు మినహా తెలియని ఏ పురుషుడితోనూ మాట్లాడొద్దని వీరికి ఆంక్షలు పెట్టినట్లు సమాచారం. ఈ మహిళా విభాగానికి మసూద్ సోదరి సాదియా అజార్ నాయకురాలు. ఇక, ఆన్‌లైన్ క్లాసులకు అఫీరా బీబీ నేతృత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఈమె పుల్వామా ఉగ్రదాడుల సూత్రధారి ఉమర్ ఫరూఖ్ భార్య. జైషేలో టాప్ కమాండర్ అయిన ఉమర్.. 2019 మార్చిలో కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో బహవల్‌పూర్‌లోని జైషే ప్రధాన కేంద్రంపై భారత్ బాంబులు జారవిడిచిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. మృతుల్లో మసూద్ బావ, సాదియా భర్త యూసఫ్ అజార్ కూడా ఉన్నాడు. ఈ ఊహించని దెబ్బ నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తోన్న అజార్ ముఠా.. కొత్త పన్నాగాలకు తెరతీసింది. ఈ క్రమంలోనే మహిళా బ్రిగేడ్‌ను ఏర్పాటు చేసింది.




