News

కుటుంబం నుంచే నైతికత మొదలు కావాలి : బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

160views

నైతికత అనేది కుటుంబం నుంచే ప్రారంభం కావాలని రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విలువల విద్యా సదస్సు’లో మంత్రి లోకేశ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

అనంతరం కోటేశ్వరరావు మాట్లాడారు. ‘‘తల్లి కడుపును శంకరాచార్యులు గర్భాలయంగా పోల్చారు. గర్భాలయం నుంచి శిశువు బయటకు వచ్చేటప్పుడు తల్లి పురిటి నొప్పులు భరిస్తుంది. సంతానం కోసం ప్రాణాలు పణంగా పెట్టే ధైర్యం ఒక్క మాతృమూర్తికే ఉంటుంది. తల్లిదండ్రులు, గురువులను గౌరవించలేని వారికి నైతికత గురించి మాట్లాడే అర్హత ఉండదు. తోబుట్టువులు, సోదరులు అనే కుటుంబం విస్తరిస్తే సమాజం అవుతుంది’’ అని కోటేశ్వరరావు చెప్పారు. కుటుంబం నుంచే విలువలను నేర్చుకునే క్రమాన్ని ప్రారంభించాలని, విద్యార్థులు తమ తల్లిదండ్రులు, తోబుట్టువులు, గురువులతో గౌరవంగా మెలగడం అలవర్చుకోవాలన్నారు.

జీవితంలో తల్లి తర్వాత తండ్రి అంతటి గొప్ప వ్యక్తి. తల్లిదండ్రులకు గౌరవం ఇస్తే నైతికత, విలువలు పెరుగుతాయి. ఆ తర్వాత తోబుట్టువులతో ప్రేమగా మెలగాలి. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా మీకు స్నేహితులు దొరుకుతారు. కానీ తోబుట్టువులు దొరకరు. అలాగే మన కంటే తక్కువగా ఉన్నవారిని చిన్నచూపు చూడడం, పరిహసించడం మంచి విధానం కాదు. ఏదైనా తొలుత ఇంటి నుంచి నేర్చుకుంటే అదే సమాజంలోనూ అమలుచేస్తాం. నైతిక విలువలు లేని విద్య వల్ల ఉపయోగం ఉండదు. తల్లిదండ్రుల తర్వాత పిల్లలను ప్రేమించేవారు గురువులే. గురువులను అపహాస్యం చేయడం, విమర్శించడం తగదు. గొప్పవారి జీవిత చరిత్రలను చదవడం విద్యార్థులు నేర్చుకోవాలి.’’ అని చాగంటి తెలిపారు.

అదనంగా క్రీడలు, కళల అభ్యాసం
విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు చాగంటి కోటేశ్వరరావు సమాధానాలిచ్చారు. ఆత్మవిశ్వాసం, ప్రణాళికాబద్ధమైన జీవితం ద్వారా ఒత్తిడి దూరమవుతుందని, పరీక్షలను సులభంగా రాయగలమే నమ్మకం విద్యార్థులకు ఉండాలని తెలిపారు. చదువుతో పాటు ప్రతి పనికీ ఒక ప్రణాళిక ఉండాలని, సమయపాలన పాటిస్తే ఒత్తిడి తగ్గుతుందన్నారు. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా చేయగలమని, అందుకోసం పరిశుభ్రంగా ఉండటం, వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ పనులు తాము చేసుకోవడం అలవర్చుకోవాలని, కీర్తనలు ఆలపించడం, క్రీడలు, చిత్రలేఖనం, సంగీతం లాంటివాటిని చదువుకు అదనంగా నేర్చుకోవాలని కోరారు. ‘‘మనం ఇతరుల నుంచి ఎలాంటివి వద్దు అనుకుంటామో, అవి మనం ఇతరులకు చేయకూడదు. రామాయణం, మహాభారతం, భాగవతం చదవడం వల్ల విలువలు పెరుగుతాయి. ఆ గ్రంథాల్లోని విలువలను నేర్చుకుంటే జీవితంలో ఉన్నతంగా ఎదుగుతాం. విద్యార్థులకు స్వీయ నియంత్రణ అవసరం. ఉదాహరణకు సెల్‌ఫోన్‌ను ఎంతవరకు వాడాలో అంతవరకే వాడితే అది ఉపయోగపడుతుంది. అతిగా వాడితే నష్టాలు వస్తాయి. అవసరంలేని విషయాల జోలికి వెళ్లకూడదు.’’ అని చాగంటి కోటేశ్వరరావు సూచించారు.