News

ఆర్మీకి మతంతో సంబంధం లేదు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

221views

ఆర్మీ సెక్యులరిజంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆలయంలోకి ప్రవేశించేందుకు తిరస్కరించిన హిందూయేతర ఆర్మీ అధికారి తొలగింపును సమర్థించింది. ఒక వ్యవస్థగా ఆర్మీ లౌకికమైందని, దాని క్రమశిక్షణ విషయంలో రాజీ పడలేమని తేల్చి చెప్పింది.

ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించేందుకు ఒక మత వర్గానికి చెందిన ఆర్మీ అధికారి శామ్యూల్‌ కమలేశన్‌ నిరాకరించారు. ఉన్నతాధికారి ఆదేశాలను ధిక్కరిస్తూ.. అది తన మత స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుందని వాదించారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు.. సైనిక క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు కమలేశన్‌ను విధుల నుంచి తొలగించారు. తనపై తీసుకున్న చర్యలను ఆయన కోర్టులో సవాల్ చేశారు. ఆర్మీ నిర్ణయాన్ని మే నెలలో దిల్లీ హైకోర్టు సమర్థించింది. ఇది పూర్తిగా క్రమశిక్షణారాహిత్యమైన చర్య అని తన తీర్పులో పేర్కొంది.

దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా చుక్కెదురైంది. ఈ తీర్పు సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఆయన ఎలాంటి సందేశం పంపుతున్నారు..? ఇది పూర్తిగా క్రమశిక్షణారాహిత్యం. ఒకసారి ఆర్మీ యూనిఫాం ధరించాక వ్యక్తిగత అభిప్రాయాలు, విశ్వాసాలకు తావుండకూడదు. ఆ వ్యక్తి అత్యుత్తమంగా విధులు నిర్వర్తించే అధికారే అయ్యుండొచ్చు.. ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించేటువంటి దుందుడుకు స్వభావం ఆర్మీకి సరిపోదు’’ అని కోర్టు పేర్కొంది.

ఈ కేసు విచారణ సందర్భంగా కమలేశన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ‘‘ఒకేఒక్క ఉల్లంఘనకే ఆయన్ను తొలగించారు. హోలీ, దీపావళి వంటి పండగల్లో పాల్గొని ఇతర మతాల వ్యక్తులతో గౌరవంగా వ్యవహరిస్తుంటారు. అన్ని రెజిమెంటల్ కేంద్ర కార్యాలయాల్లో సర్వ ధర్మస్థలం (అన్ని మతాలకు చిహ్నమైన నిర్మాణం) ఉంటుంది. అలాగాకుండా పంజాబ్‌ లోని మమున్‌లో గురుద్వారా, ఆలయం మాత్రమే ఉన్నాయి. అధికారులు ఇచ్చిన ఆదేశాల్లో గర్భగుడిలోకి ప్రవేశించడానికి మాత్రమే ఆయన నిరాకరించారు. ఆయన దుందుడుకు స్వభావం ఉన్న వ్యక్తి కాదు. ఆర్మీలో చేరడం వల్ల తన మతపరమైన గుర్తింపును కోల్పోయారు. ఆయన గుడి, గురుద్వారాలోకి వెళ్లారు కానీ.. పూజ చేయమన్నప్పుడే ఆగిపోయారు. ఆ మాత్రం స్వేచ్ఛను రాజ్యాంగం ఇచ్చింది’’ అని కోర్టుకు వెల్లడించారు. అయితే ఈ వాదనతో కోర్టు అంగీకరించలేదు.