News

ఎయిర్‌పోర్ట్‌ తరహాలో విజయవాడ రైల్వే స్టేషన్‌ – టెండర్‌ దాఖలకు డిసెంబర్‌ 2 చివరి తేదీ

256views

విజయవాడ రైల్వే స్టేషన్‌కి మహర్దశ రానుంది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటైన విజయవాడ జంక్షన్‌ త్వరలో ఎయిర్‌పోర్ట్‌ తరహాలో మెరుస్తుంది. వచ్చే 30 సంవత్సరాల్లో ప్రయాణికుల అవసరాలు, రాకపోకల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ భారీ ఆధునికీకరణ ప్రణాళికను సిద్ధం చేసింది.

నీతి ఆయోగ్‌ ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. రైల్వే ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (RLDA) పీపీపీ (పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌) విధానంలో అభివృద్ధి చేయనుంది. ఈ క్రమంలో టెండర్‌ నోటిఫికేషన్‌ ఇప్పటికే విడుదల చేశారు. టెండర్‌ దాఖలు చివరి తేదీగా ఈ ఏడాది డిసెంబర్‌ 2ను నిర్ణయించారు.

ప్రస్తుత స్థితి – భవిష్యత్‌ దిశ: ప్రస్తుతం విజయవాడ స్టేషన్‌ నుంచి సీజన్‌లో సుమారు రెండు లక్షల మంది, అన్‌సీజన్‌లో సుమారు లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. 2061 నాటికి ఈ సంఖ్య రోజుకు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు పెరగనుందని అంచనా. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం ప్రధాన ముఖద్వారం వైపు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. త్వరలో పశ్చిమ వైపు విస్తరణ కూడా చేపట్టనున్నారు.

వన్‌టౌన్‌ వైపు అదనపు ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆర్‌ఈ కాలనీ వైపు ఉన్న పాత రైల్వే క్వార్టర్స్‌ను తొలగించి, ఆ ప్రదేశాన్ని రైల్వే ఆస్తిలో కలుపనున్నారు. దీని ద్వారా రైలు మార్గాలు, పార్కింగ్‌, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, ప్రయాణికుల సౌకర్యాలకు అదనపు స్థలం లభిస్తుంది.

ప్రాజెక్ట్‌ వివరాలు:
• మొత్తం విస్తీర్ణం- 83,367 చ.మీ.

• ప్రాజెక్టు ఖర్చు- రూ. 661.11 కోట్లు

• కొత్త ప్లాట్‌ఫారాలు 2-3

• లిఫ్ట్‌లు – 20

• ఎస్కేలేటర్లు- 15

• ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు- 3

• పార్కింగ్‌ ఏరియా- జీ+2 అంతస్థులు, ఒకేసారి 2,000 కార్లు పార్క్‌ చేయవచ్చు

ఎయిర్‌పోర్ట్‌ తరహా సౌకర్యాలు: ఈ ఆధునికీకరణ ప్రాజెక్ట్‌ పూర్తి అయిన తర్వాత విజయవాడ స్టేషన్‌ ప్రయాణికుల అనుభవాన్ని పూర్తిగా మార్చబోతోంది. ఎయిర్‌పోర్ట్‌లలో ఉన్నట్లుగా వెయిటింగ్‌ లౌంజ్‌లు, రెస్టారెంట్లు, డిజిటల్‌ డిస్ప్లేలు, స్మార్ట్‌ టికెటింగ్‌ కౌంటర్లు, వై-ఫై కనెక్టివిటీ వంటి సౌకర్యాలు లభ్యమవుతాయి. స్టేషన్‌లో హోటల్‌ బ్లాక్‌లు, కమర్షియల్‌ స్పేస్‌లు, ఫుడ్‌ కోర్ట్స్, రెస్ట్ రూమ్స్‌, చైల్డ్‌ కేర్‌ సెంటర్‌ ఉండనున్నాయి. ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ నిఘా వ్యవస్థ, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయనున్నారు.

ప్రజా ప్రతినిధుల పాత్ర: ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ (డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌) ఆమోదం కోసం ఎంపీ కేశినేని శివనాథ్‌ కీలక పాత్ర పోషించారు. స్థానిక అవసరాలను గుర్తించి, రైల్వే అధికారులతో పలు చర్చలు జరిపి అభివృద్ధి ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించారు. ఆయన కృషితోనే నీతి ఆయోగ్‌ ఆమోదం సాధ్యమైంది.

భవిష్యత్‌లో మారబోయే విజయవాడ రూపం: ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయవాడ రైల్వే స్టేషన్‌ అత్యాధునికంగా రూపుదిద్దుకోనుంది. రైల్వే స్టేషన్‌ చుట్టుపక్కల ఉన్న వాణిజ్య ప్రాంతాలు, హోటళ్లు, రవాణా సదుపాయాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఇక, విజయవాడ నగరం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ప్రయాణికులకు సౌకర్యం పెరగడంతో పాటు నగర ఆర్థికాభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్ట్‌ తోడ్పడనుంది.