News

దిగుమతుల భారం దించుకుందాం

164views

అభివృద్ధి చెందిన దేశం’గా భారత్‌ను 2047 కల్లా సగర్వంగా నిలబెట్టాలన్న కల సాకారమవ్వడంలో రైతులు కీలక పాత్ర పోషించాల్సి ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. వ్యవసాయోత్పత్తుల విషయంలో దిగుమతుల భారం తగ్గించుకుంటూనే.. ఎగుమతుల పెంపుపై దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. దిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రాంగణంలో ప్రధాని శనివారం పీఎం ధనధాన్య కృషి యోజన, పప్పుధాన్యాల స్వావలంబన మిషన్‌ పథకాలను ప్రారంభించి ప్రసంగించారు. గత 11 ఏళ్లలో తమ ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్‌ను ఆరు రెట్లు పెంచిందని ప్రధాని తెలిపారు. అంతకుముందు పదేళ్లలో యూపీఏ ప్రభుత్వం ఎరువులపై రూ.5 లక్షల కోట్ల రాయితీ ఇస్తే, తమ సర్కారు పదేళ్లలో రూ.13 లక్షల కోట్లకుపైగా అందుకు వెచ్చించిందని వివరించారు. జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో రైతులకు విస్తృత ప్రయోజనాలు దక్కుతున్నాయని మోదీ అన్నారు. ఈ పండుగల సీజన్‌లో అన్నదాతలు అత్యధిక సంఖ్యలో ట్రాక్టర్లు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఒక్కో ట్రాక్టర్‌పై గత కాంగ్రెస్‌ ప్రభుత్వం పన్ను రూపంలో రూ.70 వేలు వసూలు చేసేదని, జీఎస్‌టీ సరళీకరణతో అందులో రూ.40 వేలకు మించి ఇప్పుడు ఆదా అయిందని వివరించారు.

చిత్తూరులో సమీకృత డెయిరీ ప్లాంట్‌కు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో శ్రీజ మహిళా పాల ఉత్పాదక సంఘం ఆధ్వర్యంలో రూ.219 కోట్లతో ఏర్పాటుచేస్తున్న సమీకృత డెయిరీ ప్లాంట్‌కు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. దిల్లీలో శనివారం జరిగిన కార్యక్రమం ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా సేంద్రియ రైతులు సూరం శ్రీదేవి, సాకే గంగమ్మ ప్రధానమంత్రికి కొండపల్లి ఎద్దులబండి బొమ్మ, చిరుధాన్యాలతో గీసిన చిత్రాలను బహూకరించి గౌరవించారు. సూరం శ్రీదేవి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లివాసి. సాకే గంగమ్మ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం ముష్టూరు గ్రామానికి చెందినవారు.

• రూ.24 వేల కోట్లతో చేపట్టే ధనధాన్య యోజన కింద.. 36 పథకాలను సమ్మిళితం చేసి అమలు చేయనున్నాం.

• దేశంలో వ్యవసాయపరంగా వెనుకబడిన 100 జిల్లాల్లో పంటల ఉత్పాదకత పెంపుతోపాటు పశుసంవర్ధకంపైనా ఇందులో దృష్టి సారిస్తాం.

• సాగు సాధ్యం కానిచోట మత్స్య, తేనెటీగల పెంపకానికి ప్రాధాన్యం.

• ఎంపికైన జిల్లాల్లో స్థానిక అవసరాలకు తగ్గట్టు వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకొని అధికారులు అమలు చేస్తారు.

• పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచడంతోపాటు భవిష్యత్తు తరాలకు సాధికారత కల్పించడమే పప్పుధాన్యాల స్వావలంబన మిషన్‌ లక్ష్యాలు.

• పప్పుధాన్యాల విషయంలో దేశీయ అవసరాల కోసం ఇప్పటికీ దిగుమతులపై ఆధారపడుతున్నాం. దాన్ని అధిగమించేందుకే రూ.11,440 కోట్లతో ఈ కొత్త మిషన్‌ను ప్రారంభిస్తున్నాం.

• దీనిద్వారా పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని 35 లక్షల హెక్టార్ల దాకా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

-మోదీ