News

58 మంది పాక్‌ సైనికులు హతం.. 25 ఆర్మీ పోస్టులు స్వాధీనం: అఫ్గానిస్థాన్‌

148views

అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఇరుదేశాల బలగాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాము 58 మంది పాకిస్థానీ సైనికులను మట్టుబెట్టామని అఫ్గానిస్థాన్‌ ప్రకటించింది. ఇస్లామాబాద్‌ పదేపదే తమ సరిహద్దుల ఉల్లంఘనలకు పాల్పడిన నేపథ్యంలో ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. అదే విధంగా.. ఐసిస్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించొద్దని పాకిస్థాన్‌ను హెచ్చరించింది.

దేశ రాజధాని కాబుల్‌తోపాటు ఓ మార్కెట్‌పై పాకిస్థాన్‌ బాంబు దాడులు చేసిందని అఫ్గానిస్థాన్‌ ఇటీవల ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే పాక్‌ దళాలే లక్ష్యంగా ప్రతీకార దాడులు చేపట్టినట్లు సమాచారం. తమ సేనలు పొరుగు దేశానికి చెందిన 25 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నాయని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. 58 మంది పాక్‌ సైనికులు మృతి చెందారని, మరో 30 మంది గాయపడ్డారని చెప్పారు.

ఇటీవల అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. తెహ్రీక్‌ ఇ తాలిబన్‌ పాకిస్థాన్‌ (TTP) చీఫ్‌ నూర్ వాలి మెహ్సూద్‌ స్థావరం లక్ష్యంగా పాక్‌ యుద్ధవిమానాలు దాడి చేసినట్లు పాక్‌ రక్షణ విశ్లేషణ సంస్థలు కథనాలు వెలువరించాయి. అయితే, ఈ దాడులపై ఇస్లామాబాద్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు. అఫ్గానిస్థాన్‌ విదేశాంగమంత్రి ఆమిర్‌ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం.