ArticlesNews

పెదనందిపాడు ఉద్యమ సారథి పర్వతనేని వీరయ్య చౌదరి

201views

( అక్టోబరు 4 – పర్వతనేని వీరయ్య చౌదరి జయంతి )

జాతీయోద్యమంలో గాంధీజీ ఆశయమైన సహాయనిరాకరణ ఉద్యమంలో అంతర్భాగంగా గుంటూరుజిల్లాలో మూడు ప్రధానమైన పన్నుల నిరాకరణోద్యమాలు సాగాయి. వాటిలో పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం భారతదేశ స్వాతంత్ర్యోదమ చరిత్రలో అపూర్వమైన ఘట్టం. రైతులు పన్నులు చెల్లిచంకపోతే ప్రభుత్వ ఖజానా ఖాళీయై ప్రభుత్వం జాతీయ నాయకులతో రాజీకి వస్తుందన్న ఆలోచనతో ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ జాతీయోద్యమ నాయకులైన కొండా వెంకటప్పయ్య, గొల్లపూడి సీతారామశాస్త్రి, ఉన్నవ లక్ష్మీనారాయణ, మహమ్మద్ గౌస్‌బేగ్, మంతెన రామరాజు, మద్ది రామకృష్ణ, కామరాజు భానుమూర్తి వంటి నాయకులు పెదనందిపాడు ఫిర్కాలో పర్యటించి పన్నుల నిరాకరణోద్యమ ఆవశ్యకతను ప్రచారం చేసారు. వీరి ప్రచారంతో ప్రభావితుడైన పర్వతనేని వీరయ్యచౌదరి ఉద్యమ నిర్వహణకు నాయత్వం వహించారు. ఫిర్కాలో గ్రామాధికారులందరి చేత రాజీనామా చేయించారు.

వీరయ్యచౌదరి 1886 అక్టోబరు 4వ తేదీన పెదనందిపాడు గ్రామంలో సాధారణ మధ్య తరగతి కుటుంబంలో శ్రీమతి పర్వతనేని లక్ష్మమ్మ, వెంకయ్య దంపతులకు జన్మించారు. వీరయ్య తన గ్రామంలో ఉన్న ప్రాథమిక విద్యను అభ్యసించారు. అమితమైన మాతృభాషపై అభిమానంతో తెలుగులో మంచి పరిజ్ఞానం అలవరుచుకున్నారు. అపారమైన లోకజ్ఞానాన్ని సంతరించుకున్నారు. గాంధీజీ పట్ల ఆరాధనా భావంతో కొండా వెంకటప్పయ్య వంటి నాయకుల ప్రేరణతో గ్రామీణ ప్రాంతాల్లో గుర్రంపై తిరిగి పన్నుల వ్యతిరేక ఉద్యమాన్ని మధుర గంభీర కంఠస్వరంతో, ఆసక్తికరమైన పాటలతో ప్రచారం చేశారు. ప్రజలతో మమేకమై వారిలో జాతీయోద్యమ భావాలను ప్రబోధించారు. పస్నులు చెల్లించకపోతే ప్రభుత్వం దిగి వస్తుందన్న ఉద్యమ ఆశయాన్ని గొప్పగా ప్రచారం చేశారు. అప్పటివరకు ఆ ఫిర్కాలో ఉన్న వార్షిక శిస్తు వసూలు 14.73 లక్షల నుండి 4 లక్షలకు పడిపోయింది.

పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం యావద్భారత దేశ దృష్టినే కాకుండా, బ్రిటీష్ పార్లమెంట్‌లోని సభ్యుల దృష్టిని సైతం ఆకర్షించింది. గ్రామాధికారులు రైతులతో చేతులు కలపడం, ప్రత్యామ్నాయ నియామకాలకు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ మంటగలిసింది. ఉద్యమంలో భాగంగా ఎక్కడా హింసకు తావులేకుండా రోజూ గుర్రంపై ఐదారు ఊళ్ళు తిరుగుతూ పర్వతనేని వీరయ్య చౌదరి పహారా కాశారు. గ్రామాల్లో కచేరీలు, బుర్రకథలు ఏర్పాటు చేసి ప్రజల్లో దేశభక్తిని రగల్చడమే కాకుండా పెదనందిపాడు ప్రాంతంలో 6వేల మంది యువకులతో శాంతి సైనికులను తయారు చేశారు. దౌర్జన్యంగా పన్నులు రాబట్టాలని మద్రాసు నుంచి సైన్యాన్ని రప్పించినా వీరయ్య చౌదరి నేతృత్వంలోని శాంతి సేన తిప్పికొట్టింది.

భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన ఉద్యమాలలో ప్రధానమైనదిగా పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం గుర్తింపు పొందింది. పర్వతనేనిని ఆంధ్రా శివాజీగా, దక్షిణ బార్డోలి నాయకునిగా ప్రజలు కీర్తించారు. అయితే చౌరీచారా ఘటనతో పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమాన్ని నిలిపివేయాలని గాంధీజీ ఆదేశించడంతో ఆత్మాభిమానం కలిగిన వీరయ్యచౌదరిని ఎంతగానో కలవరపెట్టింది. సుమారుగా 100 గ్రామాలలో తన సారధ్యంలో ప్రారంభమై 4 నెలలపాటు ఉధృతంగా సాగిన ప్రజాఉద్యమం ఒక్కసారిగా నీరుగారిపోవడం, తనకు తలవంపులు తేవడం వీరయ్యచౌదరి సున్నిత హృదయాన్ని గాయపరిచింది. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ ప్రజా జీవితంలోకి రాలేదు..ఏ విధమైన రాజకీయాల్లోనూ పాలు పంచుకోలేదు.

పర్వతనేని వీరయ్య చౌదరి 1970 ఫిబ్రవరి 8న హైదరాబాదులో కాలధర్మం చెందారు. వీరయ్య చౌదరి స్మారక చిహ్నంగా 1992 ఫిబ్రవరిలో పెదనందిపాడులో ఆచార్యరంగా, బెజవాడ గోపాలరెడ్డిల సమక్షంలో వీరి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఏదిఏమైనా, ఒకే ఒక్క ఉద్యమంతో అచిరకాలంలోనే అజరామరమైన ఖ్యాతిని గడించిన వీరయ్య చౌదరి నిస్వార్థ, నిరాడంబర జీవితం మనందరికీ సదా ఆదర్శం..ఆయనలోని సంఘటనా కౌశలాన్ని మనం సదా అనుసరించాలి.