News

త్రివిధ దళాల అద్భుత కలయికకు ఆపరేషన్‌ సిందూర్‌ ఉదాహరణ : రాజ్‌నాథ్ సింగ్

188views

త్రివిధ దళాలను ఉద్దేశించి ఢిల్లీలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీల మధ్య సమన్వయం ఎంతో కీలకమన్నారు. మారుతున్న యుద్ధరీతులకు అనుగుణంగా అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని సూచించారు. త్రివిధ దళాల అద్భుత కలయికకు ఆపరేషన్‌ సిందూర్‌ ఓ ఉదాహరణ అని చెప్పారు.

‘‘మన సాయుధ దళాలు ఎన్నో సంవత్సరాల అనుభవంతో ఆడిట్ వ్యవస్థలను అభివృద్ధి చేశాయి. ప్రస్తుతకాలంలో అవన్నీ అనుసంధానమై ఉండటం ముఖ్యం. విడివిడిగా పనిచేయడం వల్ల నిర్ణయం తీసుకోవడం సవాలుగా మారుతుంది. ఒక సమగ్ర వ్యవస్థ సైన్యం విశ్వాసాన్ని పెంచుతుంది. నేటి ప్రపంచంలో మనం సైబర్ దాడులు, సమాచార యుద్ధ ముప్పును ఎదుర్కొంటున్నాం. దాంతో త్రివిధ దళాల పనిని సమన్వయం చేసే వ్యవస్థను మనం అభివృద్ధి చేసుకోవాలి. అందుకోసం రక్షణశాఖ నుంచి సాధ్యమైన మద్దతు లభిస్తుంది. అలాగే చర్చలు ఉండాలి. ఆ చర్చల వేళ నాయకత్వ పాత్ర చాలా ముఖ్యమైంది. ఈ సంస్కరణలు ఎందుకు అవసరమో ప్రతి అడుగులోనూ స్పష్టంచేయాల్సి ఉంటుంది. ప్రతి సంస్కరణ ప్రాధాన్యాన్ని ఉద్యోగి అర్థం చేసుకున్నప్పుడే అది విజయవంతమవుతుంది. ఇతర దేశాల నుంచి ఉత్తమ పద్ధతులను మనం అందిపుచ్చుకోవచ్చు. అదే సమయంలో ప్రతి దేశానికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. వాటి ఆధారంగానే పరిష్కారాలు ఉండాలి’’ అని మంత్రి వెల్లడించారు.