
ఒకప్పుడు స్వాతంత్ర్య సమరయోధులను నిర్బంధించిన గదులే.. నేడు విద్యా సౌరభాలను వెదజల్లుతున్నాయి. స్వేచ్ఛా కాంక్షల అణచివేతకు వినియోగించిన కారాగారమే.. నేడు విజ్ఞాన ప్రపంచపు ద్వారాలు తెరుస్తోంది. అదే కర్ణాటక బెళగావిలోని ‘కన్నడ హయ్యర్ ప్రైమరీ స్కూల్ (నంబర్ 14)’. బ్రిటిషర్ల పాలనలో కట్టిన జైలు భవనంలో దీన్ని నిర్వహిస్తున్నారు. స్థానికులు దీన్ని ఇప్పటికీ జైలు బడిగా పిలుస్తుంటారు.
1923లో బ్రిటిష్ హయాంలో బెళగావిలోని వడ్‌గావ్‌లో ఓ జైలు నిర్మించారు. అర ఎకరం విస్తీర్ణంలో 12 గదులతో దీన్ని కట్టారు. స్వాతంత్ర్య ఉద్యమం సమయంలో పోరాట వీరులను ఇక్కడ నిర్బంధించేవారు. స్వాతంత్ర్యానంతరం దీన్ని 1950లో విద్యాశాఖకు అప్పగించారు. ఇక్కడి జైలు కార్యకలాపాలను మరోచోటికి తరలించారు. ఎత్తైన ప్రహరీ, మందమైన గోడలు, ఇనుప కిటీకిల వంటి నిర్మాణాన్ని అలాగే ఉంచి.. దీన్ని పాఠశాలగా మార్చారు.
కన్నడ మీడియం ప్రాథమిక పాఠశాలగా మొదలైన దీని ప్రస్థానం.. నేడు హైస్కూల్, ప్రీ యూనివర్సిటీ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రాథమిక తరగతులు పాత జైలు భవనంలోనే కొనసాగుతుండగా.. హైస్కూల్, కళాశాలకు కొత్త భవనాలు నిర్మించారు. దాదాపు 1,800 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. వందేళ్లు పైబడినా ఇప్పటికీ గదులు చెక్కుచెదరకుండా ఉండటం గమనార్హం.





