
కృష్ణాజిల్లా ఘంటసాలలో ఓ ముస్లిం కుటుంబం వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి, తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తూ మత సామరస్యం చాటుకుంది. ఘంటసాలకు చెందిన అక్బర్ బాషా, షర్మిల దంపతులు జలధీశ్వరాలయ ప్రాంగణంలో ఈ మండపాన్ని ఏర్పాటు చేయించారు. తొలిరోజు ఈ దంపతులు పీటల మీద కూర్చుని పూజలు చేశారు. బుధవారం అన్న సమారాధన నిర్వహించగా, గురువారం నిమజ్జనం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్బర్ బాషా, షర్మిల దంపతులను కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు సత్కరించారు.
కులమతాలకు అతీతంగా ముస్లిం సోదరుడైన అక్బర్ బాషా ఆధ్వర్యంలో ఘంటసాలలో వినాయక చవితి వేడుకలు నిర్వహించడం ఆదర్శనీయమని కృష్ణా మిల్క్ యూనియన్, వినాయక చవితి కమిటీ రాష్ట్ర చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. ఘంటసాలలో బాషా ఆధ్వర్యంలో జరుగుతున్న చవితి వేడుకల్లో ఆంజనేయులు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయకుని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన చలసాని నిర్వాహకుడు అక్బర్ బాషా– షర్మిల దంపతులను సత్కరించి స్వామి వారి చిత్రపటాలను అందించి అభినందించారు.
అనంతరం ఆంజనేయులు మాట్లాడుతూ చారిత్రాత్మకమైన ఘంటసాల గ్రామంలో బాషా ఆధ్వర్యంలో ఎనిమిది రోజులుగా వినాయక చవితి ఉత్సవాలతో ప్రతి రోజూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం విశేషమన్నారు. మొదటి రోజు పీటల మీద కూర్చుని వినాయకునికి పూజలు చేసిన బాషా, షర్మిల దంపతులను అభినందించారు. కుల మతాలకు అతీతంగా దేశాభివృద్ధికి యువత సహకరించాలని కోరారు. గ్రామస్తుల సహకారంతో ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించగలిగినట్లు అక్బర్ బాషా తెలిపారు.





