News

గిరిజన భాషల అనువాదానికి ‘ఆది వాణి’

209views

కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ త్వరలో ‘‘ఆది వాణి’’ పేరుతో కృత్రిమ మేధ సాయంతో గిరిజన భాషల్ని అనువదించే యాప్‌ను ప్రారంభించనుంది. దేశంలోని భాషా వైవిధ్యాన్ని సంరక్షించి గిరిజన జాతులకు సాధికారికత కల్పించడం కోసం ఈ చర్య తీసుకున్నట్టు గిరిజన వ్యవహారాల శాఖ వెల్లడించింది. వివిధ గిరిజన పరిశోధన సంస్థల సహకారంతో ఐఐటీ దిల్లీ, బిట్స్‌ పిలానీ, ఐఐఐటీ హైదరాబాద్, ఐఐఐటీ నవ రాయ్‌పుర్‌ సంస్థలు ఈ అనువాద సదుపాయాన్ని సృష్టించాయి. అంతరించిపోతున్న గిరిజన భాషల్ని సంరక్షించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రారంభంలో ఇది సంతాలీ (ఒడిశా), భిలీ (మధ్యపదేశ్‌), ముండారి (ఝార్ఖండ్‌), గోండీ (ఛత్తీస్‌గడ్‌) భాషల్లో అనువాదానికి ఉపయోగపడుతుంది. కోయ, గారో భాషల్ని తదుపరి దశలో యాప్‌నకు జతచేస్తారు. 2011నాటి జనగణన లెక్కల ప్రకారం భారత్‌లో షెడ్యూల్డు తెగలకు చెందినవారు 461 భాషల్లో మాట్లాడతారు. వీటిలో 81 భాషలు దుర్బల స్థితిలో ఉన్నట్టు, 42 అంతరించిపోయే దశకు చేరుకున్నట్టు గుర్తించారు. ‘‘ఆది వాణి’’ యాప్‌ హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లోని సమాచారాన్ని ఆయా గిరిజన భాషల్లోకి, గిరిజన భాషల్లోని మాటల్ని ఇంగ్లిష్, హిందీ భాషల్లోకి అనువదించేందుకు సహాయపడుతుంది. ఈ యాప్‌ను ప్రభుత్వ పథకాలపై, ఆరోగ్య సంబంధ విషయాలపై అవగాహన పెంచేందుకు ఉపయోగిస్తామని మంత్రిత్వ శాఖ పేర్కొంది.